మద్యం మత్తులో గుంటూరు ఎస్వీఎన్ కాలనీలోని లేడీస్ హాస్టల్ వద్ద నానా యాగీ చేసిన మంత్రి కుమారుడు.
-అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లోకి చొరబడేందుకు యత్నం
-పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
-మంత్రి తనయుడని తెలిసి వదిలేసిన పోలీసులు
-శనివారం రాత్రి జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
సాక్షి, గుంటూరు: అసలే మంత్రిగారి అబ్బాయ్... ఆపై మద్యం సేవించాడు.. ఇంకేముంది అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ వద్దకు వెళ్లి నానా యాగీ చేశాడు.. ఓ దశలో హాస్టల్‌లోకి చొరబడేందుకు యత్నించాడు.. మంత్రిగారి అబ్బాయ్ ఉన్నాడు కదా అనే ధైర్యంతో పక్కనే ఉన్న అతడి ఇద్దరు స్నేహితులు సైతం మద్యం మత్తులో రెచ్చిపోయారు.
అడ్డుపడితే దాడికి దిగుతారనే భయంతో హాస్టల్ వాచ్‌మన్, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మంత్రి తనయుడితోపాటు స్నేహితులిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులకు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. అదే సమయంలో మంత్రి నుంచి ఫోన్ రావడంతో రాచమర్యాదలతో సాగనంపారు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. శనివారం అర్ధరాత్రి సంఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
గుంటూరు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మంత్రి తనయుడు ఎస్వీన్ కాలనీలో స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నారు. మంత్రి కొడుకు ఇద్దరు స్నేహితులతో కలిసి శనివారం రాత్రి ఎస్వీన్ కాలనీలోని ఓ లేడీస్ హాస్టల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగంగా మద్యం తాగారు. తర్వాత మంత్రి తనయుడు ఎదురుగా ఉన్న లేడీస్ హాస్టల్‌లోకి వెళ్ళేందుకు యత్నించినట్లు సమాచారం. వీరిని అడ్డుకున్న హాస్టల్ వాచ్‌మన్, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మంత్రి తనయుడితోపాటు స్నేహితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదే సమయంలో మంత్రి నుంచి ఫోన్ రావడంతో అందరినీ రాచమర్యాదలతో ఇంటి వరకూ వెళ్లి దిగబెట్టారు.
ఈ విషయం సోమవారం వెలుగులోకి రావడంతో అలాంటిదేమీ జరగలేదంటూ పోలీసులు బొంకుతున్నారు. విషయం ఆనోటా ఈనోటా నగరం మొత్తం పాకడంతో మంత్రి కొడుకైతే ఏం చేసినా వదిలేస్తారా అంటూ నగరవాసులు పోలీసులపై మండిపడుతున్నారు. లేడీస్ హాస్టల్‌లోకి వెళ్లి ఏదైనా అఘాయాత్యానికి పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.