
మాట్లాడుతున్న నల్లా సూర్యప్రకాశ్
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాశ్ స్పష్టం చేశారు.
- ప్రజల నమ్మకాన్ని వమ్మ చేశారు
- తహసీల్దార్లే రిజిస్ట్రేషన్లు చేయడం విడ్డూరం
- కోర్టు తీర్పు టీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు
- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘నల్లా’
సంగారెడ్డి మున్సిపాలిటీ: మెదక్ జిల్లా ఉద్యమాలకు గుండె కాలయలాంటిది. ఇది ఉద్యమాల జిల్లా.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నలా సూర్యప్రకాశ్ స్పష్టం చేశారు.
గురువారం స్థానిక ఐబీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే గతంలో కంటే మెరుగైన అభివృద్ధితోపాటు పరిశ్రలు వచ్చి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశించిన రైతుల, నిరుద్యోగుల, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు.
ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123పై కోర్టు తీర్పును ప్రజా విజయంగా భావించాలని, అదే సమయంలో అధికార టీఆర్‌ఎస్‌కు చెంప పెట్టులా ఉంటుందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ నాయకత్వం వహించడం వల్ల ప్రజలు ఎన్నికల సమయంలో ఆయనకు మద్దతు ఇస్తే అధికారంలోకి వచ్చాక వారి నమ్మకాన్ని వమ్ము చేశాడన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ చేయాలనుకున్నప్పుడు 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కన పెట్టడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
కేవలం స్వార్థం కోసం 123 జీవోను తీసుకొచ్చి రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకున్నారని, దాని కోసం టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులను గ్రామాల్లో ఏజెంట్లుగా పెట్టుకున్నారన్నారు. చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా భూముల రిజిస్ట్రేషన్లు దగ్గర ఉండి తహసీల్దార్లు చేయడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమన్నారు.
తెలంగాణలో ప్రజా ద్రోహానికి పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి పక్షాలకు ఆయుధంలా దొరికిన మల్లన్నసాగర్ బాధిత రైతులపై పోలీసుల లాఠిచార్జీని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి దశ, దిశ లేకపోవడమే కారణమన్నారు.
తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేవిధంగా ఆ పార్టీ నాయకులే ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలనాపరంగా విభజించాలని సూచించారు. ఈ సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఆర్ మల్లయ్య, అందోల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజీవరావు, నాయకులు బాలకృష్ణారెడ్డి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.