ఒంటరి తనాన్ని భరించలేక నల్లాబత్తిన రమణారెడ్డి (45) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయచోటి పట్టణంలో చోటు చేసుకొంది.
– ఉరి వేసుకొని ఆత్మహత్య
రాయచోటి టౌన్: ఒంటరి తనాన్ని భరించలేక నల్లాబత్తిన రమణారెడ్డి (45) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయచోటి పట్టణంలో చోటు చేసుకొంది. రాయచోటి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గాలివీడు మండలం గోపనపల్లె పూజారి వాండ్లపల్లెకు చెందిన నల్లాబత్తిన రమణారెడ్డి ఐదేళ్ల క్రితం పల్లె నుంచి పట్టణానికి కాపురం మార్చాడు. అప్పటికే ఆయన భార్య మృతి చెందింది. కుమారుడిని చదివించుకొనేందుకు రాయచోటికి మకాం మార్చాడు. నాలుగు సంవత్సరాల క్రితం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్ వేసుకొని పండ్లు, ఐస్‌క్రీమ్స్, చైనీ ఫాస్ట్‌పుడ్, పాలు, పెరుగు వంటి వస్తువులు అమ్ముకొని వచ్చే ఆదాయంతో జీవనం సాగించేవాడు. నా అనే వారు ఎవరూ లేకపోవడం, భార్య కూడా లేకపోవడం ఆయనకు తీరని వెలితిని కలిగించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి షాపు మూసిన తరువాత ఆ షాపులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తెల్లవారు జామున షాపు తెరవడానికి వచ్చిన మరో వ్యక్తి తలుపులు తెరిచి చూడగా అప్పటికే రమణారెడ్డి ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.