నేరెళ్ల ఘటనలో కేటీఆర్‌ దోషే.. | Sakshi
Sakshi News home page

నేరెళ్ల ఘటనలో కేటీఆర్‌ దోషే..

Published Thu, Jul 27 2017 1:31 AM

నేరెళ్ల ఘటనలో కేటీఆర్‌ దోషే..

► ‘హ్యుమన్‌రైట్స్‌’కు తీసుకెళ్లి అట్రాసిటీ కేసుకు డిమాండ్‌ చేస్తం   
►కాంగ్రెస్‌ పార్టీ ముసలినక్కే కావచ్చు..
► టీఆర్‌ఎస్‌ పార్టీలా మోసపూరితమైనది కాదు  
► కేసీఆర్‌ది దొంగ దీక్షని తెలిసినా.. తెలంగాణకు మద్దతిచ్చాం
► కాపలాకుక్కలా ఉంటానన్న కేసీఆర్‌ గుంటనక్కలా మారాడు    
► 31న చలో సిరిసిల్ల : సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి


సాక్షి, కరీంనగర్‌: నేరెళ్ల దళితులపై జరిగిన దాడి ఘటనలో రాజన్న సిరిసిల్ల ఎస్పీతోపాటు మంత్రి కేటీఆర్‌ సైతం దోషేనని.. ఇసుక మాఫియాతో భాగస్వామ్యం ఉన్నం దువల్లే చర్యలు తీసుకోలేకపోతున్నారని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిఅన్నారు. ఈనెల 31న చేపట్టనున్న చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరెళ్లలో ఇసుక లారీ ప్రమాదం జరిగ దళితుడు చనిపోతే రాజకీయాలకు అతీతంగా పార్టీలు స్పందించాయని, అందులో టీఆర్‌ఎస్‌ కూడా ఉందన్నారు.

లారీల దహనం కేసులో ఇంటరాగేషన్‌ పేరుతో ఎస్పీ థర్డ్‌ అమాయకులపై డిగ్రీ ప్రయోగించడమే కాకుండా ఈ విషయాన్ని బయట చెబితే కుటుంబాల్లోని మహిళలపై వ్యభిచారం కేసులు, పిల్లలపై గంజాయి కేసులు నమోదు చేస్తామని బెదిరించడం సిగ్గుచేటన్నారు. ‘ఎస్సీ అయితే కొమ్ములున్నాయారా..? అట్రాసిటీ కేసుతో నన్నేమి చేస్తారురా..’ అంటూ దుర్భాషలాడారని, ఐపీఎస్‌లో ఇదే ట్రేనింగ్‌ ఇచ్చారా? అని ప్రశ్నించారు. దళితుల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా భావించి, ప్రభుత్వ ఆకృత్యాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ముసలి నక్క అంటూ కేటీఆర్‌ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ ముసలి నక్కేకావచ్చుగానీ.. టీఆర్‌ఎస్‌లా మోసపూరితమైన  పార్టీ కాదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలర్పించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. కేసీఆర్‌ది దొంగ దీక్షని తెలిసి కూడా ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కోసం సమర్థించామని స్పష్టంచేశారు.

తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్‌ ఇప్పుడు గుంటనక్కలా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. 31న నిర్వహించే ఛలో సిరిసిల్ల కార్యక్రమంతో యావత్‌ సమాజాన్ని మేల్కొలిపి టీఆర్‌ఎస్‌ ఆకృత్యాలను బయటపెడతామని హెచ్చరించారు. పోలీసులు నిర్ధోషులైతే 15 రోజులుగా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలా చికిత్స పొందుతున్నారని ప్రశ్నించారు. బా«ధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ కేసును హ్యుమన్‌ రైట్స్‌కు తీసుకెళ్తామని, బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదుకు డిమాండ్‌ చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement