ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
విశాఖపట్నం: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం విశాఖలో ప్రారంభమైన భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 22వ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, దక్షిణాదిలో మిగులు విద్యుత్ కలిగిన ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు. తమ రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని అన్నారు. తీరప్రాంతాల అభివృద్ధి, తయారీ రంగ పరిశ్రమల కారణంగానే చైనా వృద్ధి చెందిందని గుర్తు చేశారు.
ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయన్నారు. అనవసర నిబంధనలు తొలగించి పరిశ్రమలకు అనుమతులు సరళీకృతం చేస్తామని తెలిపారు. వృద్ధిరేటులో దేశంతో ఏపీ పోటీ పడుతోందన్నారు. 2022 నాటికి దేశంలో మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా, 2049 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కూడా సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చెప్పారు.