తండాల్లో పంచాయితీ | gram panchayat in thandas | Sakshi
Sakshi News home page

తండాల్లో పంచాయితీ

Feb 20 2018 8:50 AM | Updated on Feb 20 2018 8:59 AM

gram panchayat in thandas - Sakshi

తండాల్లో ‘పంచాయితీ’ మొదలైంది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు.. తండాల విభజనకు దారితీస్తోంది. నూతనంగా ఆవిర్భవించే పంచాయతీలకు మా తండా పేరే పెట్టాలంటే.. మా తండా పేరు పెట్టాలంటూ భీష్మిస్తుండడం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐదొందలు జనాభా దాటిన గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిం చింది. ఒకవేళ నిర్దేశిత జనాభా లేకపోతే సమీప తండాలను విలీనం చేసి ప్రతిపాదనలు పం పాలని సూచించింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రెండేసి, మూడేసి తండాలను కలుపుతూ పంచాయతీని ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఏ తండాను పంచాయతీగా నిర్వచించాలనే అంశం విభేదాలకు దారితీస్తోంది. ఎవరికి వారు పంతానికి దిగుతుండడంతో కొత్త గ్రామ పంచాయతీల కసరత్తుపై ప్రభావం చూపుతోంది. 

167 కొత్త గ్రామ పంచాయతీలు
కొత్త గ్రామ పంచాయతీల జాబితా ఖరారుపై ఇంకా కసరత్తు జరుగుతోంది. తొలుత 174 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 167 పల్లెలే ఉండడంతో వాటిని ప్రతిపాదించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 500 లోపు జనాభా, 1.5 కిలోమీటరు పరిధిలోని గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు కొత్త పంచాయతీల ఏర్పాటు క్రతువును దాదాపుగా కొలిక్కి తెచ్చింది. కాగా, నూతన పంచాయతీల ఆవిర్భావంపై రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీకి తమ ఊరు పేరే పెట్టాలని, ఫలానా రెవెన్యూ సర్వే నంబర్లు ప్రతిపాదిత పంచాయతీలోనే రావాలని కోరికలను స్థానికులు, నాయకులు అధికారుల ముందు పెడుతున్నారు.

మరికొన్ని గ్రామాల్లోనైతే.. కాసుల వర్షం కురిపించే పరిశ్రమలను కూడా తమ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చేలా చూడమని విన్నవిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగైదు గ్రామాలతో ఉన్న గ్రామ పంచాయతీని పునర్విభజిస్తుండడంతో రెవెన్యూను కోల్పోతామని భావిస్తున్న ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాలు రెవెన్యూ సరిహద్దును కూడా సూచిస్తుండడం అధికారగణానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలావుండగా, కొత్త గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చిన పంచాయతీ విభాగం.. ప్రతిపాదనలను కలెక్టర్‌కు నివేదించింది. దీనిపై మరోసారి సూక్ష్మంగా పరిశీలించి జాబితాను ప్రభుత్వానికి పంపనుంది. అత్యధికంగా ఫరూఖ్‌నగర్, మాడ్గుల తదితర మండలాల్లో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడనున్నాయి. మరోవైపు ఆమనగల్లు పంచాయతీకి అనుబంధంగా ఐదు తండాలను గతంలో పంచాయతీలుగా ప్రతిపాదించినప్పటికీ, ఆమనగల్లును నగరపంచాయతీగా చేయాలనే యోచన ఉన్నందున.. తాజాగా వీటిని కొత్త పంచాయతీల జాబితా నుంచి తొలగించారు. ఇదిలావుండగా, జిల్లావ్యాప్తంగా 11 నగర పంచాయతీ/మున్సిపాలిటీల ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరింది. స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు ప్రతిపాదనలు ఖరారు చేయడంతో వీటిని యథావిధిగా ప్రభుత్వానికి పంపారు.

బ్యాలెట్‌ బాక్సులొచ్చాయ్‌
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సరిపడా బ్యాలెట్‌ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో అధికార యం త్రాంగం పొరుగు రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను తెప్పిస్తోంది. కొత్త పంచాయతీల జాబితా దాదాపు ఖరారు కావడం, పోలింగ్‌ కేంద్రాలపై స్పష్టత రావడంతో బ్యాలెట్‌ పెట్టెల లభ్యతపై దృష్టిసారించింది. రంగారెడ్డి జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరు పోలింగ్‌ డబ్బాలు పెట్టనున్నందున 6,360 బాక్సులు అవసరమవుతాయని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే, ఇందులో కేవలం 613 బాక్సులు మాత్రమే జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు తేల్చింది. దీంతో మిగతా బ్యా లెట్‌ బాక్సులను కర్ణాటక నుంచి తీసుకురావా లని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. విజయపుర జిల్లా నుంచి మంగళవారం జిల్లాకు బ్యాలెట్‌ బాక్సులను తీసుకొచ్చారు. ఏప్రిల్‌ లేదా మే నెలలో ఎన్నికలు జరుగనున్నట్లు తాజా సంకేతాలను బట్టి తెలుస్తుండడంతో దానికి అనుగుణంగా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement