రామప్పకు గోదావరి జలాలు

రామప్పకు గోదావరి జలాలు - Sakshi

  •   పాలంపేట చెరువు నింపేందుకు ఏర్పాట్లు

  •  భారీ వర్షాలు కురిసినా   నిండని వైనం 

  •  పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు..  ప్రస్తుత నిల్వ 0.4 టీఎంసీలు

  •  దేవాదులతో చారిత్రక చెరువుకు జలకళ

  •  

     

    సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా చిన్నా, పెద్ద చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా చారిత్రక నేపథ్యమున్న రామప్ప(పాలంపేట) చెరువు పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. గరిష్ట స్థాయి వర్షపాతం నమోదైనా.. ఆ చెరువు సగం కూడా నిండకపోవడం గమనార్హం. రామప్ప చెరువు నీటి నిల్వ సామర్థ్యం 2.99 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.4 టీఎంసీల నీరే ఉంది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవాదుల ప్రాజెక్టు నీటితో రామప్ప చెరువును నింపాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దేవాదుల ప్రాజెక్టు మూడోదశలో టన్నెల్‌ నిర్మాణం నిలిచిపోవడంతో రామప్ప చెరువులోకి నీరు చేరే పరిస్థితి లేకుండాపోయింది. ప్రాజెక్టు మొదటి దశలో భీంఘనపూర్‌ నుంచి నీటిని పులుకుర్తి రిజర్వాయర్‌లో... రెండో దశలో చలివాగు ప్రాజెక్టులో, మూడో దశలో రామప్ప చెరువులోకి తరలించేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించారు. టన్నెల్‌లోకి నీరు ప్రవేశించడంతో ఈ పనులు ఆగిపోయాయి. టన్నెల్‌ స్థానంలో పైపులైను నిర్మించాలనే కొత్త ప్రతిపాదనలు ముందుకు కదలడంలేదు. ఈ పరిస్థితుల్లో రామప్ప చెరువులోకి దేవాదుల జలాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సాగునీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నిర్ణయంతో రామప్ప చెరువు జలకళను సంతరించుకునే అకాశం ఉంది. దేవాదుల ప్రాజెక్టులో మొదటి దశలోని భీంఘనపూర్‌ చెరువు నుంచి పులుకుర్తి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్‌ చేస్తారు. ఈ పైపులైను రామప్ప చెరువు అంతర్భాగం నుంచి వెళ్లింది. దేవాదుల మొదటి దశ పైపులైను ప్రస్తుతం చెరువు నీటిలో ఉండిపోయింది. ఈక్రమంలో సాగునీటి శాఖ అధికారులు దేవాదుల రెండోదశ పైపులైనును చెరువు శిఖం నుంచి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పైపులైను ఉన్న ఎయిర్‌ వాల్వులను తెరిచి రామప్ప చెరువును నింపేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. రామప్ప చెరువు పరివాహక ప్రాంతంలో పది ఎయిర్‌ వాల్వ్‌లు ఉన్నాయి. వీటిని తెరిస్తే పది రోజుల్లో రామప్ప చెరువు జలకళను సంతరించుకొని, గరిష్ట నీటిమట్టాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

     

    ఎస్సారెస్పీతో...

     

    శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు మొదటి, రెండో దశ ప్రాజెక్టు నీటితో జిల్లాలోని చెరువులన్నింటినీ నింపేందుకు ఏర్పాట్లు చేయాలని సాగునీటిపారుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వర్షాభావ ప్రాంతాల్లోని చెరువులకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఒక్కటే ఆధారం. భారీగా వరదలు వస్తేనే ఈ ప్రాజెక్టు కాలువల్లో నీరు వస్తుంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఈ ప్రాజెక్టు నుంచి నీరు వదిలేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా వదిలే నీటితో మన జిల్లాలోని చెరువులను నింపేందుకు అవకాశాలు ఉన్నాయి. 

     

     19 అడుగులకు చేరిన నీటిమట్టం

     

    వెంకటాపురం : మండలంలోని  పాలంపేట రామప్ప సరస్సు నీటిమట్టం శనివారం సాయంత్రానికి 19 అడుగులకు చేరింది. కాగా, ఈ సరస్సు గరిష్ట నీటిమట్టం 36 అడుగులు. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top