రమణీయం..జోడు రథోత్సవం | glorious joint rathotsavam | Sakshi
Sakshi News home page

రమణీయం..జోడు రథోత్సవం

Mar 3 2017 10:08 PM | Updated on Sep 5 2017 5:06 AM

రమణీయం..జోడు రథోత్సవం

రమణీయం..జోడు రథోత్సవం

కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం గూళ్యం. ఈ గ్రామంలో సిద్ధేశ్వర, గాదిలింగేశ్వర జోడు రథోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

- భక్తజన సంద్రమైన గూళ్యం
- భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య వేడుకలు
గూళ్యం (హాలహర్వి): కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం గూళ్యం. ఈ గ్రామంలో సిద్ధేశ్వర, గాదిలింగేశ్వర జోడు రథోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల భక్తులు వేల  సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవంలో గొరవయ్యల నృత్యాలు అలరించాయి. ముందుగా గ్రామపెద్ద రఘునందనగౌడ్, ఆలయ అధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకి కొలువుంచారు. ఊరేగింపుగా తీసుకెళ్లి రథాలపై అధిష్టింపజేశారు. అనంతరం భక్తుల జయజయ ధ్వనుల మధ్య రథాలు ముందుకు కదిలాయి. గాదిలింగేశ్వరస్వామి ఆలయానికి 800 మీటర్ల దూరంలోని ఎదురు బసవన్న దేవాలయం వరకు జోడు రథాలు సాగాయి. అక్కడ బసవన్నకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రథాలను యథాస్థానానికి చేర్చారు. గ్రామ సర్పంచ్‌ రాజశేఖర్‌గౌడ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో లోకేష్, ఎంపీపీ బసప్ప, వైఎస్‌ ఎంపీపీ కల్యాణ్‌గౌడు వైఎస్సార్సీపీ నాయకులు భీమప్పచౌదరి, దిబ్బలింగ, గడినాడ కన్నడ సంఘం నాయకులు కుమారస్వామి, నీలాధర్, బజారప్ప, గాదిలింగప్ప, చిన్నమైలారప్ప, మోకా మైలారప్ప తదితరులు పాల్గొన్నారు.
 
అన్నదానం 
రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులకు నియోజకవర్గ పరిధిలోని ఆలూరు, బాపురం, హాలహర్వి, కర్ణాటకలోని బసరకోడు, అడ్లిగి, సింధువాళం తదితర గ్రామాల భక్తులు 40కి పైగా అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి గూళ్యం గ్రామానికి 20, గుంతకల్, ఆదోని తదితర డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు.
 
భారీ బందోబస్తు  
సిద్ధలింగేశ్వర, గాదిలింగేశ్వర స్వాముల జోడు రథోత్సవాలను పురస్కరించుకుని ఆలూరు సీఐ అబ్దుల్‌గౌస్, హాలహర్వి ఎస్‌ఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరు గురు సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 100 మంది కానిస్టేబుళ్లు, 50 మంది హోంగార్డులు, 30 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement