పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వండి
అధ్యాపకులు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టీచింగ్‌తో పాటు యూనివర్సిటీలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరముందని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య అన్నారు.
తెయూ(డిచ్‌పల్లి) : అధ్యాపకులు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టీచింగ్‌తో పాటు యూనివర్సిటీలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరముందని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పి.సాంబయ్య అన్నారు. గురువారం తెయూ ప్రధాన క్యాంపస్‌తో పాటు భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లోనూ అధ్యాపకులతో నిర్వహించిన సమావేశాల్లో వీసీ మాట్లాడారు. అధ్యాపకులు, ఇతర సిబ్బంది కలిసి మెలిసి టీం వర్క్‌గా పని చేసి వర్సిటీలో మంచి వాతావరణం నెలకొల్పాలని సూచించారు. ఇక ముందు ప్రమోషన్లకు పనితీరు, పరిశోధనలతో సంబంధం ఉంటుందని ఆయన వెల్లడించారు. తాను ప్రతి మూడు నెలలకు అధ్యాపకులు, సిబ్బంది పనితీరును సమీక్షిస్తానని పేర్కొన్నారు. భిక్కనూరు సౌత్ క్యాంపస్‌ను తొలిసారిగా సందర్శించిన వీసీ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జయప్రకాశ్ రావుతో కలిసి అన్ని విభాగాలను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్ భవనాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. హాస్టల్ భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మాణ పనులు పూర్తిచేసి త్వరలోనే అందజేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని వీసీ ఆదేశించారు. క్యాంపస్‌లో నిర్ణయించిన మేరకు 2 వేల మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సౌత్ క్యాంపస్ ఆవరణలో వీసీ, రిజిస్ట్రార్‌లు మొక్కలను నాటారు. సౌత్ క్యాంపస్ ఆహ్లాదంగా ఉందని, దీనిని మరింతగా అభివృద్ధి చేసి అకడమిక్ నాణ్యతలో కొత్త ప్రమాణాలు చాటాలని వీసీ పిలుపునిచ్చారు. అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. వీసీని సౌత్ క్యాంపస్ అధ్యాపకులు, సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రజా సంబంధాల అధికారి రాజారాం, ప్రిన్సిపాల్ లలిత, వైస్ ప్రిన్సిపాల్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.