శంకరంబాడి విగ్రహానికి పూలమాల వేస్తున్న అవధాని మేడసాని మోహన్, సాహితీ వేత్తలు
తెలుగు తల్లి, తెలుగు భాష విశిష్టతను చాటుతూ రాష్ట్ర గేయాన్ని అందించిన గొప్పకవి శంకరంబాడి సుందరాచార్యులకు పలువురు సాహితీ వేత్తలు ఘన నివాళులు అర్పించారు.
తిరుపతి కల్చరల్: తెలుగు తల్లి, తెలుగు భాష విశిష్టతను చాటుతూ రాష్ట్ర గేయాన్ని అందించిన గొప్పకవి శంకరంబాడి సుందరాచార్యులకు పలువురు సాహితీ వేత్తలు ఘన నివాళులు అర్పించారు. శంకరంబాడి 103 జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. శంకరంబాడి సాహితీ పీఠం ఆధ్వర్యంలో తిరుచానూరు రోడ్డులోని లక్ష్మీపురం సర్కిల్ ఉన్న శంకరంబాడి విగ్రహానికి ప్రముఖ అవధాని మేడసాని మోహన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ‘మా తెలుగుతల్లికి... మల్లెపూదండ...’ గేయాన్ని డాక్టర్ జి.సుహాసిని ఆలపించారు. ఈ సందర్భంగా శంకరంబాడి సాహితీ పీఠం గౌరవాధ్యక్షుడు ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచారి తిరుపతి నగరంలో జన్మించడం మనందరి అదృష్టమన్నారు. పీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి.మస్తానమ్మ మాట్లాడుతూ గొప్ప సాహితీ వ్యక్తులను నేటి తరానికి తెలియజేయడమే పీఠం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమలో పీఠం ప్రధాన కార్యదర్శి దేవరాజులు, సాహితీ వేత్తలు సాకం నాగరాజు డాక్టర్ కె.రెడ్డెప్ప, శ్రీమన్నారాయణ, ఆముదాల మురళి పాల్గొన్నారు.