పొలమారుతోంది | Sakshi
Sakshi News home page

పొలమారుతోంది

Published Mon, Aug 15 2016 12:25 AM

పొలమారుతోంది - Sakshi

ఆంధ్రా అన్నపూర్ణగా పేరొందిన ‘పశ్చిమ’లో రైతులకు కొత్త కష్టమొచ్చిపడింది. ముందెన్నడూ ఎరుగని రీతిలో వర్షాకాలంలోనూ నారుమడులు, నాట్లు వేసిన చేలు నీరందక ఎండుతున్నాయి. పలు పంట కాలువలు, బోదెలు నీరు లేక అడుగంటాయి. ఒకవైపు గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తున్నా.. నది చెంతనే ఉన్న మండలాల్లోనూ వరి చేలు బీడువారుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కొవ్వూరు/పెరవలి/ యలమంచిలి :  గోదావరి డెల్టాలోని నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం, పాలకొల్లు తదితర మండలాల్లో నీరందక నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఈ మండలాలన్నీ కచ్చితంగా నీరందించాల్సిన పర్మినెంట్‌ జోన్‌లో ఉన్నాయి. అయినా అక్కడి రైతులకు నీటికష్టాలు తప్పడం లేదు. మొగల్తూరు మండలంలోని కాళీపట్నం,  శేరేపాలెం గ్రామాల రైతులు ఈ ఖరీఫ్‌లో పంట విరామం∙ప్రకటించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ మండలంలో 18,069 హెక్టార్లలో నాట్లు వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు  నాట్లు వేసిన విస్తీర్ణం 100 హెక్టార్లు మించలేదు. అయినా ఇక్కడి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రయత్నించటం లేదు.   ఆగస్టు రెండో వారం దాటుతున్నా ఇప్పటి వరకు ఈ మండలంలో ఐదుశాతం నాట్లు కూడా పూర్తికాలేదు. యలమంచిలి మండలంలో ఇప్పటికీ సుమారు 1,500 ఎకరాల్లో నాట్లు పడలేదు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. .నరసాపురం మండలంలో ఆయకట్టు శివారు ప్రాంతాల్లో  సుమారు 800 ఎకరాల్లో నాట్లు వేయలేదు. సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఆయకట్టు ఉన్న మొగల్తూరు, నరసాపురం మండలాలకు చెందిన రైతులు ఈ సీజన్‌లో పొలాల్లో నాట్లు వేయకపోతే భూములు చౌడుబారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరవలి, పెనుగొండ మండలాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. పెరవలి మండలం ఖండవల్లి, ఉసులుమర్రు, నల్లాకులవారిపాలెం గ్రామాల్లో నాట్లు ఎండుతున్నాయి. గోదావరిలో పుష్కలంగా నీరున్నా సాగునీరు అందకపోవడం ఏమిటో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్వా పంటకు ఇటువంటి పరిస్థితి కల్పించి.. దాళ్వా  సాగు లేకుండా చేయడానికే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రైతులు ధ్వజమెత్తుతున్నారు. దాళ్వాలో గోదావరి నీరంతా పట్టిసీమకు తరలించుకుపోయేందుకే కుయుక్తులు పన్నుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  
పెండ్యాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకం 
కొవ్వూరు మండలం సీతంపేటలోని విజ్జేశ్వరం విద్యుత్‌ కేంద్రం(జీటీపీఎస్‌)లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో పెండ్యాల పంపింగ్‌ స్కీమ్‌ ఆయకట్టు కింద ఉన్న 6,800 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ డెల్టా కాలువ నుంచి జీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి తీసుకున్న నీటిని తిరిగి పెండ్యాల స్కీమ్‌కు సరఫరా చేస్తున్నారు. ఈనెల 8 నుంచి జీటీపీఎస్‌లో విద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో  వారం రోజుల నుంచి నిడదవోలు, పెరవలి మండలాల పరిధిలో ఆయకట్టు రైతులు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు. మరో వారం రోజులు నీరందకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం కాలువ, బ్యాంక్‌ కెనాల్‌కు అవసరమైన నీరు సరఫరా చేయకపోవడంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు చవిచూస్తున్నారు.  
మెట్టలో చుక్కనీరులేక.. గోపాలపురం : మెట్టప్రాంతంలోనూ సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, నందిగూడెం, కొవ్వూరుపాడు, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల్లోని చెరువులు అడుగంటాయి. ఈ చెరువుల పరిధిలో సుమారు 2,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది.   గుడ్డిగూడెం దూదుశిల చెరువు చుట్టూ తాడిపూడి కాలువ ఉన్నా ఈ చెరువులో చుక్క నీరు లేదు. భూములు బీడువారాయి.   మండలంలో 4,200 హెక్టార్లకుగాను సగమే నాట్లు పూర్తయ్యాయి. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నరసాపురం మండలాల్లోనూ 80శాతం నాట్లు వేశారు. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడిన ఆయకట్టులో సగం ఆయకట్టులో నాట్లు పడలేదని అధికారులు చెబుతున్నారు. అలాగే కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలో ఉన్న పెదపాడు మండలంలో 20శాతం మాత్రమే నాట్లు వేశారు. 18,500 ఎకరాల ఆయకట్టుకు గానూ ఇప్పటికీ 13వేల ఎకరాల్లో నాట్లు పడలేదు.పెదవేగి, దెందులూరు మండలాల్లోను ఇదే దుస్థితి నెలకొంది.  
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement