కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన గౌరు నర్సయ్య(45) అనే కౌలురైతు పంట నష్టం, అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
కోనరావుపేట (కరీంనగర్ జిల్లా ) : కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన గౌరు నర్సయ్య(45) అనే కౌలురైతు పంట నష్టం, అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ కూలీగా చేస్తూ ఎకరంన్నర భూమిని కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేయగా వర్షాల్లేక పంట ఎండిపోయింది. సాగుకు చేసిన లక్ష రూపాయల అప్పుతోపాటు ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు నాలుగు లక్షల అప్పు అయింది. ప్రస్తుతం మరో కూతురు పెళ్లికి ఉంది.
సాగు చేసిన పంట ఎండిపోయి అప్పులు తీర్చేందుకు మార్గం లేకపోవడంతో మనస్తాపం చెందాడు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన నర్సయ్య ఐకేపీ సెంటర్ సమీపంలోని కాలువలో పంట కోసం తెచ్చిన క్రిమిసంహారక మందును తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన గ్రామస్తులు చూసి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో రోదనలు మిన్నంటాయి.