
నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నకిలీనోట్లను చలామణి చేస్తున్న ముఠాను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం సెంట్రల్ : జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నకిలీనోట్లను చలామణి చేస్తున్న ముఠాను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 2 లక్షల నిజమైన కరెన్సీ, రూ. 3.75 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అనంతపురం నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మల్లికార్జునవర్మ వివరాలు వెల్లడించారు. నకిలీనోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో నాల్గవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్ తన సిబ్బందితో కలిసి సోమవారం తపోవనంలో వాహన తనిఖీలు చేపట్టారు.
ఏపీ02ఏ క్యూ2237 నెంబర్ గల ద్విచక్రవాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా.. బ్యాగులో పెద్దఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. ధర్మవరం పట్టణంలోని సిద్దయ్య గుట్టకు చెందిన అశోక్ అనే యువకుని దగ్గర రూ.1.88 లక్షల నకిలీ కరెన్సీ, రూ.1.40 లక్షల నిజమైన నోట్లు లభించాయి. అలాగే కనగానపల్లి మండలం కుర్లపల్లికి చెందిన బోయ వెంకటేష్ వద్ద రూ.1.87 లక్షల నకిలీ కరెన్సీ, రూ. 60 వేల నిజమైన డబ్బు దొరికింది. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు కేంద్రంగా రాకెట్
నకిలీ, అసలైన కరెన్సీని పోల్చి చూస్తే పెద్దగా తేడా లేదు. కానీ రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా అనే పదం ముద్రణలో అచ్చు తప్పు దొర్లింది. ఇది తప్పా మరెక్కడా నకిలీ కరెన్సీ అని గుర్తుపట్టలేని స్థాయిలో ముద్రించారు. అయితే.. పట్టుబడిన నిందితులు నకిలీ కరెన్సీని చలామణి మాత్రమే చేస్తున్నట్లు సమాచారం. దీని వెనుక పెద్ద రాకెట్ నడుస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తి ఈ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు పట్టుబడిన నిందితులు పోలీసు విచారణలో అంగీకరించారు. వారెవరన్న వివరాలను పోలీసులు వెల్లడించలేదు. వారు పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఇన్‌చార్జ్ సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐలు శ్రీరామ్, రఫీ పాల్గొన్నారు.