ప్రచారంలో విఫలమవుతున్నాం
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారంలో విఫలమవుతున్నామని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు.
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారంలో విఫలమవుతున్నామని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయలన్నారు. ఎంపీపీ ఛాంబర్ జిల్లా సమావేశం ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పరిమి రవికుమార్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఛాంబర్ జిల్లా గౌరవాధ్యక్షుడు పిల్లి సత్తిరాజు, కార్యదర్శిలు కేతా సత్యనారాయణ, వడ్లపూడి ప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
సమావేశంలో పలువురు ఎంపీపీలు మాట్లాడుతూ జిల్లాలో ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలు మాదిరిగా ఉండటం తప్ప ఏ పనీ చేయలేకపోతున్నారని, ఇటు విధులు లేక అటు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధులు, నిధులు లేకపోతే ఏ పనులు చేయగలమని, గుర్తింపు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ ఎంపీటీసీలకు విధులు, నిధుల విషయంలో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని అయినప్పటికీ విధులు, నిధులు ఉంటేనే పనులు చేస్తామన్న ఆలోచన నుంచి బయిటకు రావాలన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కొవ్వూరు, ఉంగుటూరు, పాలకొల్లు ఎమ్మెల్యేలు జవహార్, గన్ని వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరడం లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్‌ను సత్కరించారు.