మనోజ్‌కుమార్ రెడ్డి(ఫైల్)
పూతలపట్టు మండలంలోని కరిణిపల్లె వద్ద చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారిలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.
– మరొకరికి తీవ్ర గాయాలు
పూతలపట్టు, చిత్తూరు(కార్పొరేషన్) :
కలకాలం తోడుగా నీడగా ఉండాలని కోరుతూ ఆ చిట్టి చెల్లెలు అన్నకు రక్షా బంధన్‌ను కట్టింది. ఆమె ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కారు రూపంలో వచ్చిన మృత్యువు అన్నను కబళించింది. దీంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూతలపట్టు మండలంలోని కరిణిపల్లె వద్ద చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారిలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసుల కథనం మేరకు... అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట మండలం వెలిచెలమల గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్ రెడ్డి(22), పెద్దపంజాణి మండలం కత్తరాలపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్(22) చిత్తూరు సీతమ్స్‌లో ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నారు. గురువారం రాఖీ పండుగ కావడంతో మనోజ్‌కుమార్ రెడ్డి ద్విచక్ర వాహనంలో ఇద్దరూ తిరుపతిలోని తన చెల్లెలి వద్దకు వెళ్లారు. రాఖీ కట్టించుకుని అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. పూతలపట్టు సమీపంలోని కరిణిపల్లె వద్ద తిరుపతి వైపు వెళుతున్న ఇండికా కారు ఢీకొంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు.
30 నిమిషాలు ఆలస్యంగా 108 వాహనం
108 వాహనం 30 నిమిషాలు ఆలస్యంగా ప్రమాద స్థలానికి చేరుకుంది. ఈ క్రమంలో మనోజ్‌కుమార్‌రెడ్డి మృతి చెందాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మీకాంత్‌ను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి చెన్నైకి తరలించారు. సకాలంలో 108 వాహనం వచ్చి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేవాడని మనోజ్‌కుమార్‌రెడ్డి తల్లిదండ్రులు ఆస్పత్రి ముందు బోరున విలపించారు. మనోజ్‌కుమార్ రెడ్డి చనిపోయిన సమాచారం తెలియగానే కళాశాలలోని అతని స్నేహితులు శుక్రవారం పెద్ద ఎత్తున చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బోరున విలపించారు.