న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి - Sakshi

- ఎంపీ బుట్టా రేణుక

కర్నూలు (లీగల్‌): న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని కర్నూలు లోక్‌సభ సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న న్యాయవాద సంఘ కార్యాలయ భవన నిర్మాణాన్ని పరశీలించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.చాంద్‌బాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ గతంలో ఎవరికి రాని అవకాశం న్యాయవాదులు తనకు ఇచ్చినందుకు సంతోషంగానూ, గర్వంగా ఉందన్నారు. తనకు ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో రూ.50 లక్షలు కేటాయించానని, భవిష్యత్తులో ఎంపీ నిధులు పెరిగితే తప్పకుండా కర్నూలు మహిళా న్యాయవాదులకు కూడా సహకారం అందిస్తానన్నారు. జిల్లాలో తీవ్రంగా మంచినీటి సమస్యను ప్రజలు ఈ ఏడాది ఎదుర్కొంటున్నారని, మంచినీటి సమస్య పరిష్కారానికే తాను ప్రాధాన్యతనిస్తానన్నారు.

 

కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం తనను ఇంతగా అభిమానించిందని వారికి ఎల్లవేళలా సహకారం అందిస్తామన్నారు. పార్లమెంటులో లా కమిషన్‌ ప్రతిపాదనను వ్యతిరేకించి న్యాయవాదులకు అండగా నిలుస్తామన్నారు. బార్‌ కౌన్సిల్‌ సభ్యులు పి.రవిగువేరా మాట్లాడుతూ న్యాయవాద వృత్తికి ఉరితాడుగా మారేలా కమిషన్‌ ప్రతిపాదనలున్నాయని, పార్లమెంటులో ఆ బిల్లును అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు ఎంపీ తన గళం విప్పి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చాంద్‌బాషా మాట్లాడుతూ రూ.50 లక్షలు ఎంపీ నిధులు కేటాయించి ఎంపీ బుట్టా రేణుక న్యాయవాదులపై తన అభిమానం చాటుకున్నారన్నారు.

 

సీనియర్‌ న్యాయవాదులు నాగలక్ష్మిదేవి, ఓంకార్, రంగారవికుమార్, పి.నిర్మల, సంపత్‌కుమార్, ఎన్‌.నారాయణరెడ్డి, సువర్ణారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి కె.పుల్లారెడ్డి, తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి తదితరులు మాట్లాడి ఎంపీ నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా వచ్చే ఎన్నికల్లో ఎంపీ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఒక విద్యావేత్త, మహిళ అయిన బుట్టా రేణుక ప్రజల సమస్యల çపట్ల స్పందిస్తున్న తీరును వారు గుర్తు చేసుకున్నారు. అనంతరం కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఎంపీ బుట్టా రేణుకను ఘనంగా సన్మానించింది.  కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సీవీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అనిల్‌కుమార్, కరీం, తిరుపతయ్య, గీతామాధురి, సీనియర్, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top