
ట్యాంపరింగ్ కుంభకోణంపై జేసీ విచారణ
కొమ్మాది, మధురవాడ గ్రామాల్లో 1–బీ రికా ర్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన విచారణ చేయనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
► బాద్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
► విచారణ తరువాత నిందుతులపై కేసులు
► మీడియాతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, విశాఖపట్నం: కొమ్మాది, మధురవాడ గ్రామాల్లో 1–బీ రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన విచారణ చేయనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. విచారణ అనంతరం బాధ్యులైన అధికారులతో పాటు వెనక ఉన్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం తన చాంబర్‌లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల పరిరక్షణ కోసమే ఈ కుంభకోణాన్ని బయటపెట్టామే తప్ప, తమకు ఎలాంటి వ్యక్తిగత శ్రద్ధ లేదన్నారు.
కొమ్మాదిలో 1బీ రికార్డుల ట్యాంపరింగ్‌పై వారం రోజుల పాటు క్షేత్రస్థాయి విచారణ చేస్తామన్నారు. అనంతరం మధురవాడలో కూడా మరో రెండువారాల పాటు సర్వే చేయిస్తామని చెప్పారు. పరదేశీపాలెం, అన్నవరంలలో రెండు వారాల పాటు సర్వే జరిపిస్తామన్నారు. ఏడు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వివరించారు. మొత్తం రికార్డులన్నీ సరిచేస్తామని, ట్యాంపరింగ్ వల్ల ఎవరూ ఇబ్బందిపడకుండా చర్యలు చేపడతామన్నారు. ఆర్‌టీఐ ద్వారా సమాచారం ఇవ్వడాన్ని కూడా ఈ కారణంగా తాత్కాలికంగా నిలిపేశామన్నారు.
గ్రామాల్లో భూగర్భ జల పరిశోధన
జిల్లాలో అన్ని గ్రామల్లో భూగర్భజలల స్థితిని తెలిసుకునేందుకు పరిశోధన చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఈ పరిశోధన 15 మండలాల్లో ప్రారంభించామన్నారు. ప్రతి గ్రామంలో వేసవికాలం, శీతకాలం, వర్షకాలం భూగర్బజలాల మట్టం ఏ స్థాయిలో ఉంటున్నాయో అంచనాలు వేసి భవిష్యత్‌లో నీరు నిల్వ ఉంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ శాటలైట్ బేస్డ్ డేటాలో ఎంటర్ చేస్తామన్నారు.
గ్రామల్లో భూగర్భ జల పరిశోధన
ప్రతి ఇంటికి వచ్చేనెల 8వ తేదీ నాటికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా దీపం పథకం కింద మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఇందు కోసం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో గ్రామల వారీగా గ్యాస్ కనెక్షన్ లేని వారిని గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ సర్వే ఈ నెల 24 నాటికి పూర్తవుతుందని, ఇందులో గ్యాస్ లేని వారికి జూన్ 8లోగా మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
ఆరోగ్య శాఖలో ఆలస్యంగా బదిలీలు
జిల్లాలోని అన్ని శాఖల్లో ఈ నెల 24వ తేదీలోగా బదిలీలు పూర్తి అవుతాయని, ఆరోగ్య శాఖలో మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. ఆరోగ్య శాఖకు సంబంధించి గైడ్‌లైన్స్ రావడం ఆలస్యం కావడం వల్లే బదిలీల ప్రక్రియకు సమయం పడుతుందని చెప్పారు. గిరిజన ప్రాంతంలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు, మైదానపు ప్రాంతంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేస్తున్నామన్నారు. ‘విద్యార్థుల సేవలో రెవెన్యూ’ కార్యక్రమం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా విద్యార్థులకు ధ్రువపత్రాలు జారీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.