కొన్నిసార్లు కళ్లు మనల్ని మోసం చేస్తాయి. కొన్ని చిత్రాలు కళ్లకు గంతలు కడతాయి. వాస్తవాన్ని దాచేసి.. ఏదో భ్రాంతిని కలుగజేసే ప్రయత్నం చేస్తాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిచ్చాపాటిగా ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడితో ముచ్చటిస్తూ సిగరెట్ కాలుస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. కేసీఆర్, యనమల ఒకప్పటి మిత్రులు. అయితే, విజయవాడ పర్యటనలో కేసీఆర్ సిగరెట్ తాగారా? లేదా అన్నది మాత్రం కచ్చితంగా ధ్రువీకరణ కాలేదు. కొందరు ఆయన సిగరెట్ కాల్చారని అంటున్నారు. మరికొందరు సిగరెట్ కాల్చలేదని, ఆ ఫొటోలో కనిపిస్తున్నది వాస్తవం కాదని చెప్తున్నారు. మొత్తానికి ఈ అంశం మాత్రం నెటిజన్లకు హాట్‌టాపిక్‌గా మారింది.
సీఎం కేసీఆర్ సోమవారం విజయవాడ వెళ్లి.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తాను నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఆహ్వానం, చంద్రబాబు విందు ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్‌కు ఏపీ మంత్రులు సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్, యనమల ముచ్చటిస్తుండగా ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సిగరెట్ కాలుస్తున్నట్టు ఆ ఫొటోలో కనిపించింది. నిజానికి కేసీఆర్ ఎప్పుడో సిగరెట్ మానేశారని, ఈ ఫొటోలో కనిపిస్తున్నది వాస్తవం కాదని కొందరు అంటున్నారు.