Ayuta chandiyagam
-
యాగం పరిపూర్ణం
అయుత చండీయాగం చివరిరోజు అగ్ని ప్రతిష్ట * 70 లక్షల ఆహుతులు, 10 లక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్యహోమం * అమ్మవారికి 12 టన్నుల పరమాన్న ద్రవ్య తర్పణం * యాగం ముగింపు సమయంలో అపశ్రుతి.. యాగశాలకు ఆగ్నేయ దిశలో చెలరేగిన మంటలు * 45 నిమిషాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది * అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి కేసీఆర్ మహారుద్రయాగం * అగ్ని ప్రమాదంతో యాగస్థలికి రాకుండానే వెనుదిరిగిన రాష్ట్రపతి * యాగస్థలిని శుద్ధి చేసి మహాపూర్ణాహుతి నిర్వహించడంతో ముగిసిన క్రతువు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సకల జనహితం, సస్య సమృద్ధిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన అయుత చండీ మహాయాగం ఆదివారంతో పరిపూర్ణమైంది. పసుపువర్ణ వస్త్రాల్లో వచ్చిన 1,100 మంది రుత్విక్కులు నవార్ణ మంత్ర జపాలు చేస్తుండగా చండీమాతకు సీఎం 70 లక్షల ఆహుతులు, 10 లక్షల నవార్ణ మంత్రాలతో 12 టన్నుల పరమాన్న ద్రవ్యాన్ని ఆజ్యహోమ తర్పణం చేశారు. రెండు టన్నుల గంధపు చెక్కలతో హోమ గుండాలను వెలిగించారు. 4 రోజులపాటు ప్రశాంతంగా సాగిన యాగంలో చివరిరోజు అపశ్రుతి దొర్లింది. రాష్ట్రపతి ప్రణబ్ చండీ మాతకు మహా పూర్ణాహుతి ఇచ్చి యాగం పరిసమాప్తి చేసే క్రతువు మాత్రమే మిగిలి ఉందనగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 10 నిమిషాల్లో రాష్ట్రపతి మంటపం వద్దకు చేరుకుంటారనగా యాగశాలకు మంటలు అంటుకోవడం తో రుత్విక్కులు అగ్నిహోమం చేసే యాగశాల ప్రధాన మంటపం చాలావరకు అగ్నికి ఆహుతైంది. దీంతో రాష్ట్రపతి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రమాదానికి కొద్ది గంటల ముందే ఏపీ సీఎం చంద్రబాబు యాగానికి వచ్చి వెళ్లారు. ప్రమాదం తర్వాత కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దంపతులతో కలసి మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నవార్ణ జపాలకు తొలిసారి విఘ్నం శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి పంపిన ప్రత్యేక పట్టు వస్త్రాలు ధరించిన సీఎం కేసీఆర్ దంపతులు ఉదయం 8.30కి యాగశాల ప్రవేశం చేశారు. మహా సరస్వతి, మహాకాళి, వరలక్ష్మి విగ్రహాల వద్ద గురు ప్రార్థన చేశారు. గోపూజ, గణపతి హోమం తదితర పూజలు చేశారు. మహా పూర్ణాహుతికి ఆరంభంగా ఉదయం 9.40 గంటలకు రాజశ్యామల మంటపంలోని ప్రధాన హోమ గుండంలో అగ్నిప్రతిష్ట చేశారు. ఈ హోమ గుండంలోని అగ్నితోనే మిగతా 100 హోమగుండాలను వెలిగించారు. ఒక్కో హోమ గుండం వద్ద 11 మంది రుత్విక్కులు హోమం మొదలు పెట్టారు. పరమాన్నం, పూలు, పండ్లు, తమలపాకులతో ఆజ్యహోమం చేశారు. 10.20 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యాగశాలకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు మంత్రి హరీశ్‌రావు స్వాగతం పలకగా.. యాగశాల ప్రధాన ద్వారం వద్ద రుత్విజులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. చంద్రబాబు, ఆయన వెంట వచ్చిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఉన్నారు. వీరు మొదటి యాగశాలలో ప్రదక్షిణ చేశారు. అనంతరం కేసీఆర్ వారిని శివపార్వతుల విగ్రహం వద్దకు తీసుకెళ్లారు. రాజశ్యామల మంటపంలో కేసీఆర్, చంద్రబాబు మహారుద్ర యాగంలో పాల్గొన్నారు. తన వెంట తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు, పండ్లు, పూలను చంద్రబాబు.. మహారుద్రయాగం హోమగుండానికి సమర్పించారు. బాబు వచ్చిన సమయంలోనే యాగశాలలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో రుత్వికులు నవార్ణ మంత్ర జపాలను ఆపేసి కాసేపు బయటికి వెళ్లిపోయారు. ఇప్పటివరకు నిర్విఘ్నంగా కొనసాగిన నవార్ణ మంత్ర జపాలకు తొలిసారి బ్రేక్ పడినట్లు అయింది. యాగనిర్వాహకులు ఒక దిశలో మాత్రమే ఫ్యాన్లు నడిపి పొగను బయటికి పంపడంతో 30 నిమిషాల అనంతరం రుత్వికులు హోమగుండాల వద్దకు వచ్చి కూర్చున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కేసీఆర్ మళ్లీ మహారుద్రయాగం ప్రారంభించారు. కాళీ మాతకు పట్టు వస్త్రాలు, అరటి, కమలాలు, దానిమ్మ, ఆపిల్, జామ, మామిడి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం తదితర ఫలాలతో పాటు, పసుపు, కుంకుమతో పూర్ణాహుతి సమర్పించారు. ఆహుతైన ప్రధాన యాగ మంటపం మధ్యాహ్నం 12.30కి రుత్వికులు నవార్ణ మంత్ర జపాలు పూర్తి చేశారు. చండీమాతకు అంతిమ పూర్ణాహుతి ఇవ్వడం ద్వారా యాగం పరిసమాప్తం చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రపతి రాక కోసం ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపు ఆపివేశారు. ఈ లోగా కొద్దిసేపు విరామం ఇవ్వడంతో 80 శాతం మంది రుత్వికులు యాగశాల వదిలి బయటికి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో అంటే మధ్యాహ్నం 1.05 గంటలకు ఒక హోమగుండం వద్ద మిగిలిపోయిన ఆవు నెయ్యిని గుండంలోకి గుప్పించారు. దీంతో ఒక్కసారిగా యాగశాల ఆగ్నేయ దిశలో అగ్ని కీలలు పైకి లేచి యాగశాల పై కప్పును తాకాయి. అప్పటికే పొగతో వేడిగా మారిన పైకప్పు గడ్డి ఒక్కసారిగా అంటుకుంది. దీంతో రుత్విక్కులు యాగం చేసే ప్రధాన యాగ మంటపం 80 శాతం అగ్నికి ఆహుతైంది. అయిదు నిమిషాల్లోనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాలుతున్న యాగశాలపైకి ఎక్కి యంత్రాల సాయంతో నీళ్లు చల్లడంతో మంటలు కొంత తగ్గుముఖం పట్టాయి. 20 నిమిషాల పాటు హెలికాప్టర్లోనే ప్రణబ్ మధ్యాహ్నం 1.28 గంటలకు రాష్ట్రపతి హెలికాప్టర్లు వచ్చాయి. ఒక హెలికాప్టర్ యాగశాల చుట్టూ చక్కర్లు కొట్టింది. రాష్ర్టపతి హెలికాప్టర్తోపాటుగా మరో పైలట్ హెలికాప్టర్ యాగశాలకు కిలోమీటర్ దూరంలో శివారు వెంకటాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగాయి. మంటలు అదుపులోకి వస్తే మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి సిద్ధమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు రాష్ట్రపతి హెలికాప్టర్లోనే వేచి ఉన్నారు. అయితే రాష్ట్రపతి చీఫ్ సెక్యూరిటీ అధికారి నుంచి అనుమతి రాకపోవడంతో ప్రణబ్ ముఖర్జీ తిరిగి వెళ్లిపోయారు. యాగస్థలిని సంప్రోక్షణ చేసిన పండితులు అగ్నిమాపక సిబ్బంది దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి మధ్యాహ్నం 2 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విశ్వామిత్ర అతిథి గృహంలోనికి తరలించారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత శృంగేరీ పీఠం శిష్యులు పురాణం మహేశ్వరశర్మ, ఫణిశశాంకశర్మ, గోపికృష్ణశర్మ వేదమంత్రాలతో యాగస్థలిని సంప్రోక్షణ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌ను పూర్ణకుంభంతో ఆహ్వానించి హోమం నిర్వహించారు. చండీమాతకు అంతిమంగా మహాపూర్ణాహుతి సమర్పించి యాగాన్ని పరిపూర్ణం చేశారు. ఇందులో పరమాన్నంతోపాటు అయిదు టన్నుల బెల్లం, నాలుగు టన్నుల నెయ్యి వినియోగించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ వి.హనుమంత రావు, రిటైర్డ్ జడ్జి ఎల్.నరసింహరెడ్డి, సినీ ప్రముఖులు జమున, తనికెళ్ల భరణి, డి.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, చండీయాగం నిర్వహణ కోసం వార్త పత్రిక సీఎండీ గిరీష్ సంఘీ, జేఎంజే గ్రూపు చెర్మైన్ జేఎం జోషితో కలిసి రూ.25లక్షల విరాళం అందజేశారు. -
అయుత చండీయాగం పరిసమాప్తం
-
ఒక్కపూట భోజనం.. రెండు పూటలా స్నానం
♦ 1,500 మంది నిష్టాగరిష్టులైన రుత్విక్కులకు ప్రత్యేక వంటకాలు ♦ 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భోజనశాల ♦ ఒక్కపూటకు 4 క్వింటాళ్ల బియ్యం.. క్వింటాలు పప్పు.. క్వింటాలు కూరగాయలు ♦ కేరళ నుంచి తెప్పించిన పోకచెక్క ఆకు విస్తర్లు ♦ 40 మంది బ్రాహ్మణోత్తములతో వంటకాలు ♦ వడ్డించడం కోసం మరో 120 మంది బ్రాహ్మణులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అయుత చండీయాగానికి రుత్విక్కులే కీలకం. పరమ నిష్టాగరిష్టులైన 1,500 మంది పండితులు.. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు. యాగం ప్రారంభం నుంచి పరిసమాప్తి వరకు ప్రతి ఒక్కరూ ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. యాగశాలలో మంచినీళ్లు కూడా ముట్టరు. రెండు పూటలా స్నానమాచరిస్తారు. దీక్షా వస్త్రాలను ధరిస్తారు. దీక్షాబద్ధులు యాగం జరిగే ప్రాంతాన్ని విడిచి వెళ్లరు. దేవనాంది చేయడం వల్ల వీరికి జాతశౌచాలు అంటవు. అత్యంత నిష్టతో ఉండే వీరికి రుచికరమైన ప్రత్యేకమైన భోజన వసతులు ఏర్పాటు చేశారు. రుత్విక్కులకు వంట ఏర్పాట్లు చూసే బాధ్యత ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కు అప్పగించారు. వంటల కోసం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి 40 మంది బ్రాహ్మణోత్తములను ప్రత్యేకంగా రప్పించారు. వడ్డించడం కోసం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి 120 మంది బ్రాహ్మణులను తీసుకువచ్చారు. పోకచెక్కల ఆకులతో ప్రత్యేకంగా తయారు చేయించిన విస్తర్లను కేరళ నుంచి తెప్పించారు. వీరి కోసం 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భోజనశాలను ఏర్పాటు చేశారు. వీఐపీలు, స్థానిక బ్రాహ్మణులకు... వీఐపీలు, స్థానిక బ్రాహ్మణుల కోసం వీఐపీ లాంజ్ పక్కనే మరో భోజనశాల ఏర్పాటు చేశారు. ఈ మెనూ కూడా దాదాపు రుత్వికుల మెనూనే పోలి ఉంది. కానీ బఫే పద్ధతిలో, ప్లాస్టిక్ విస్తర్లతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ భోజనాలకు కూడా 4 క్వింటాళ్ల బియ్యం, క్వింటాలు కూరగాయలు, క్వింటాలు పప్పు, 5 క్వింటాళ్ల పెరుగును వినియోగిస్తున్నారు. ఫాంహౌస్ నుంచే కూరగాయలు, పూలు యాగంలో ప్రత్యేక వంటల కోసం కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచే కూరగాయలు తరలిస్తున్నారు. మొత్తం మూడు వంటశాలలు ఏర్పాటు చేశారు. రుత్విక్కుల కోసం ఒకటి, వీఐపీలు, సాధారణ బ్రాహ్మణులకు మరోటి, భక్తుల కోసం ఇంకొక వంటశాలలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. రుత్విక్కుల వంటశాలలోకి ఇతరులకు ప్రవేశం లేదు. తయారు చేస్తున్న కూరల్లో 80 శాతం కూరగాయలను కేసీఆర్ ఫాంహౌస్ నుంచే కోసి నేరుగా తీసుకుని వస్తున్నారు. క్యాప్సికం, క్యాబేజీ, బెండకాయ, దొండకాయ, టమాటా, ఆలుగడ్డ, మెంతికూర, పచ్చిమిర్చి, పాలకూర తదితర కూరగాయలను ఫాంహౌస్ నుంచే తీసుకువచ్చారు. వంకాయ, కొంత టమాటా మాత్రమే బయటి నుంచి తెచ్చామని రుత్విక్కుల భోజన వసతి బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీ సతీశ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇక యాగానికి ఫాంహౌస్‌లోని బంతి, చామంతి పూలనే వినియోగిస్తున్నారు. గులాబీ, తామర పుష్పాలతో పాటుగా కొన్ని చామంతి పూలను బెంగుళూరు నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. ఏ రోజు.. ఏ మెనూ తొలిరోజు మెనూ.. ► ఉదయం అల్పాహారం: ఇడ్లీ, వడ, ఉప్మా ► మధ్యాహ్న భోజనం: అన్నం, చపాతి, ముద్దపప్పు, సాంబారు, పాతాలబాజీ (శనగపప్పు ఆకుకూర, బెల్లం), చల్ల పులుసు, బీన్స్ ఫ్రై, పూర్ణాలు, పులిహోర, అరటికాయ బజ్జీ, పెరుగు, పాపడ, రోటి పచ్చడి. ► రాత్రి అల్పాహారం : అటుకుల కిచిడి. రెండో రోజు ► ఉదయం అల్పాహారం : అటుకుల పొంగళి, చట్నీ. ► మధ్యాహ్న భోజనం : అన్నం, చపాతి, ఆకుకూర పప్పు, రసం, క్యాప్సికం కూర, సాంబారు, ఆలుబోండ, బాదుషా, పులిహోర, రోటి పచ్చడి. ► రాత్రి అల్పాహారం: పూరి, పన్నీర్ బటర్ మసాల, ఆలు కుర్మా. మూడో రోజు ► ఉదయం అల్పాహారం: అటుకుల పోని, చట్నీ, పెరుగు. ► మధ్యాహ్న భోజనం : అన్నం, చపాతి, పులిహోర, టమాటా పప్పు, పోని చల్ల, మసాల వంకాయ, సాంబారు, శనగ లడ్డూ, మైసూర్ బజ్జీ, గుమ్మడికాయ బర్డా. ► రాత్రి అల్పాహారం : బొంబాయి రవ్వ ఉప్మా, చట్నీ, పెరుగు. నాలుగో రోజు ► ఉదయం అల్పాహారం: ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ. ► మధ్యాహ్న భోజనం: అన్నం, చపాతి, పులిహోర, ఆకుకూర పప్పు, చల్ల పులుసు, పన్నీర్ బటర్ మసాల, దొండకాయ మసాల, సాంబారు, జిలేబీ, ఆలుబాత్, మిర్చీ రైతా. ► రాత్రి అల్పాహారం: అటుకుల దద్దోజనం. చివరి రోజు ► ఉదయం అల్పాహారం : ఉప్మా చుడువ. ► మధ్యాహ్న భోజనం: అన్నం, చపాతి, పులిహోర, ముద్దపప్పు, పోని చల్ల, బెండకాయ ఫ్రై, క్యాప్సికం కూర, మోతి చూరబూంది లడ్డూ, పాలకూర బజ్జీ, మెంతికూర పెసర పప్పు, సాంబారు, పెరుగు. ► రాత్రి అల్పాహారం: దద్దోజనం, మిరపబజ్జీ. ఒక్క పూటకు వినియోగిస్తున్న బియ్యం, పప్పు, కూరగాయల వివరాలు.. బియ్యం: 4 క్వింటాళ్లు కూరగాయలు : ఒక క్వింటాలు పప్పు: ఒక క్వింటాలు చపాతి: 6 వేలు పెరుగు : 5.25 క్వింటాలు వస్త్ర ధారణ ఇలా.. తొలిరోజు: పసుపు పచ్చ వర్ణ వస్త్రాలు, వాటికి ముదురు మెరూన్ రంగులో పట్టు అంచు రెండో రోజు: ఎరుపు వర్ణ వస్త్రాలు మూడో రోజు: గులాబీ వర్ణం పంచెలు, దోవతులు, దానికి పట్టు అంచు నాలుగో రోజు: తెలుపువర్ణం పంచెలు, దోవతులు, వాటికి బంగారు రంగు పట్టు అంచు ఐదో రోజు: పసుపు పచ్చ వర్ణం వస్త్రాలు, వాటికి ముదురు మెరూన్ రంగులో పట్టు అంచు అటు ఉద్యమం.. ఇటు ఆధ్యాత్మికం! 1997లో తొలిసారి చండీయాగం నిర్వహించిన కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణవాదాన్ని, ఆధ్యాత్మికాన్ని రెండు కళ్లుగా చేసుకున్నారు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు యజ్ఞయాగాలు నిర్వహించి మహా పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. 1997 లో తొలిసారిగా చండీయాగాన్ని నిర్వహించిన కేసీఆర్ ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు నిర్వహించిన యాగాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలివీ.. 1994: సిద్దిపేటలో శ్రీత్రిదండి చిన జీయర్‌స్వామి పర్యవేక్షణలో బ్రహ్మయజ్ఞం నిర్వహించారు. 1996: ఎర్రమంజిల్‌లోని ఎమ్మెల్యేల గృహ సముదాయంలో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు, అభిషేకాలు నిర్వహించారు. 1996: రాష్ట్ర రవాణ శాఖ మంత్రిగా తన అధికారిక నివాసంలో సహస్ర లక్ష్మీసూక్త పారాయణ సహిత అభిషేకం నిర్వహించారు. 1997: తొలిసారి బాపిశాస్త్రి పర్యవేక్షణలో చండీ హవణం చేపట్టారు. 2004: గోదావరి తీరంలో శత చండీయాగం చేశారు. ఈ యాగాన్ని శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి చేయించారు. 2005: కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నవగ్రహ మఠం-చండీయాగం చేశారు. 2006: మెదక్ జిల్లా కొండపాక మండలం మర్పడగలోని శ్రీ సంతానమల్లికార్జున స్వామి దేవాలయంలో 500మంది రుత్విక్కులతో సహస్ర చండీయాగం చేశారు. అదే ఏడాది తన నివాసంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. 2007: పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో చండీయాగం, సుదర్శన యాగాలను నిర్వహించారు. 2008: సిద్దిపేటలోని కోటి లింగేశ్వరాలయంలో గాయత్రీ మహాయాగం చేశారు. 2009: తెలంగాణ భవన్లో నక్షత్ర మండల యాగం. 2010: తెలంగాణ భవన్లో చండీయాగం. 2014: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాంపు కార్యాలయంలో సుదర్శన యాగం నిర్వహించారు. 2015: ఎర్రవల్లిలో అయుత చండీయాగం నిర్వహిస్తున్నారు. యాగం ఫలప్రదమవుతుంది శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి సందేశం గజ్వేల్: ‘‘సీఎం కేసీఆర్ లోక కల్యాణార్థం చేపట్టిన అయుత మహాచండీ యాగం విజయవంతమవుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు’’ అని శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి సందేశాన్ని పంపారు. పీఠం ముఖ్యకార్యనిర్వహణాధికారి గౌరీశంకర్ ద్వారా లేఖను పంపారు. దీన్ని యాగస్థలిలో రుత్విక్కులు చదివి వినిపించారు. గౌరీశంకర్ మాట్లాడుతూ.. 200 ఏళ్ల చరిత్రలో ఏ చక్రవర్తి, పాలకుడు ఇంత పెద్దఎత్తున యాగం నిర్వహించిన దాఖలాల్లేవన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారితో యాగస్థలి ‘మినీ ఇండియా’ను తలపిస్తోందన్నారు. ఈ యాగం చరి త్రలో నిలిచిపోతుందన్నారు. నాలుగేళ్ల క్రితం శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి నిర్వహించిన పద్ధతిలోనే కేసీఆర్ యాగం చేస్తున్నారని కొనియాడారు. పిల్లలకు ఇబ్బంది కలిగితే తల్లి అనుగ్రహించినట్లుగానే ప్రజల బాగోగుల కోసం పాలకులు చండీ మాతను ఆశ్రయించారన్నారు. కేసీఆర్ ఇప్పుడు చండీయాగం చేస్తున్నది తల్లి అనుగ్రహం కోసమే అన్నారు. మహారాజులూ చేయలేని బృహత్కార్యాన్ని ప్రజా సంక్షేమం కోసం తలకెత్తుకున్న కేసీఆర్ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు. భారీగా తరలివచ్చిన భక్తజనం తొలిరోజు అయుత చండీయాగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎర్రవల్లి సమీప గ్రామాలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తొలిరోజు సుమారు 10 వేల వాహనాలు వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎర్రవల్లి చుట్టూ ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించారు. జిల్లా ఎస్పీ సుమతితో పాటు ఆరుగురు ఏఎస్పీలు, 28 మంది డీఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించారు. పోలీసులు సాధారణ భక్తులను కొంత ఇబ్బందులకు గురిచేశారు. కొందరు కానిస్టేబుళ్లు భక్తులపై దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం కనిపించింది. ఇక మీడియా ప్రతినిధులనైతే కనీసం దగ్గరకు కూడా అనుమతించలేదు. ట్రాఫిక్ నియంత్రణ కోసమంటూ దారులు మూసివేయడంతో.. నర్సన్నపేట నుంచి వచ్చిన భక్తులు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చండీయాగం.. క్షణక్షణం ఉదయం ► 8:30: యాగశాలకు సీఎం దంపతుల ఆగమనం ► 8:48: యాగశాలకు గవర్నర్ నరసింహన్ దంపతుల రాక ► 9:15 : పూజలు ప్రారంభం ► 10: 30: దుర్గాదేవికి మహా మంగళ హారతి ఇచ్చిన యాగ యజమాని కేసీఆర్ ►10:40: ఒక్కో హోమగుండం చుట్టూ నలుగురు తెలుగు, ముగ్గురు కన్నడ, ముగ్గురు మరాఠా, ఒకరు ఇతర రాష్ట్రానికి చెందిన మొత్తం 11 మంది రుత్విక్కులు ఆసీనులయ్యారు ►10:50: శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు భారతీ తీర్థస్వామి పంపిన సందేశాన్ని చదివి వినిపించిన రుత్విక్కులు ►11:19: ఏకోత్తర వృద్ధి సంప్రదాయ పద్ధతిలో జపాలు ప్రారంభించిన 1,100 మంది రుత్విక్కులు మధ్యాహ్నం: ►1:40: ముగిసిన తొలిరోజు పారాయణం. 4 వేల నవార్ణ మంత్రజపం పూర్తి ► 2:05: విడిది కేంద్రాలకు రుత్విక్కులు ► సాయత్రం 5:50: హైకోర్టు తాత్కాలిక సీజే బొసాలే రాక. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన సీఎం. ► 6:05: హైకోర్టు జడ్జి చంద్రయ్య రాక. ► 6:15: యాగస్థలానికి హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి రాక - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
చండీయాగం క్షేత్రంలో గణపతి హోమం
-
చండీయాగం క్షేత్రంలో గణపతి హోమం
మెదక్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దంపతులు సోమవారం ఎర్రవెల్లిలోని అయుత చండీయాగం క్షేత్రంలో గణపతి పూజలు నిర్వహించారు. ఈనెల 23వ తేదీ నుంచి అయుత చండీయాగం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పూజలు చేసినట్లు సమాచారం. అలాగే శృంగేరి పీఠం రుత్వికుల ఆధ్వర్యంలో గురు పూజ కూడా నిర్వహించారు. అదేవిధంగా గ్రామ దేవతలకు కూడా పూజలు చేశారు. అయితే ఈ కార్యక్రమాలకు మీడియాను అనుమతించలేదు. -
విజయవాడలో కేసీఆర్ సిగరెట్ కాల్చారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిచ్చాపాటిగా ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడితో ముచ్చటిస్తూ సిగరెట్ కాలుస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. కేసీఆర్, యనమల ఒకప్పటి మిత్రులు. అయితే, విజయవాడ పర్యటనలో కేసీఆర్ సిగరెట్ తాగారా? లేదా అన్నది మాత్రం కచ్చితంగా ధ్రువీకరణ కాలేదు. కొందరు ఆయన సిగరెట్ కాల్చారని అంటున్నారు. మరికొందరు సిగరెట్ కాల్చలేదని, ఆ ఫొటోలో కనిపిస్తున్నది వాస్తవం కాదని చెప్తున్నారు. మొత్తానికి ఈ అంశం మాత్రం నెటిజన్లకు హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్ సోమవారం విజయవాడ వెళ్లి.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తాను నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఆహ్వానం, చంద్రబాబు విందు ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్‌కు ఏపీ మంత్రులు సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్, యనమల ముచ్చటిస్తుండగా ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సిగరెట్ కాలుస్తున్నట్టు ఆ ఫొటోలో కనిపించింది. నిజానికి కేసీఆర్ ఎప్పుడో సిగరెట్ మానేశారని, ఈ ఫొటోలో కనిపిస్తున్నది వాస్తవం కాదని కొందరు అంటున్నారు. -
అయుత చండీయాగం పనులు వేగిరం
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ యాగం జరుగనుంది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు 10 గ్యాలరీలను పూర్తి చేశారు. పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. శృంగేరీ శారదాపీఠం పండితులు, బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వరశర్మ, బ్రహ్మశ్రీ ఫణి శశాంక్‌శర్మ ఆచార్య బ్రహ్మలుగా వ్యవహరిస్తున్న ఈ అయుత చండీయాగంలో... 1,500 మంది రుత్విక్కులుగా పాల్గొంటున్నారు. ఏకోత్తర వృద్ధి విధానంలోనే జరిపే ఈ అయుత చండీయాగంతో పాటు రుద్రయాగం, కుమారస్వామి, గణపతి, రుద్రహోమాలు, చతుర్వేద హవనం, పారాయణాలు, జపాలు కూడా జరగనున్నాయి. ► శృంగేరీ పీఠం వేద పండితులు పురాణం మహేశ్వరశర్మ, శశాంక్‌శర్మ, గోపీకృష్ణ అయుత చండీయాగం నిర్వహిస్తారు. ► మొత్తం 1,500 మంది రుత్విక్కులు హాజరుకానున్నారు. ► 108 హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నారు. 1,100 మంది బ్రాహ్మణులు ఐదు రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణాలు చేస్తారు. ► మొదటి రోజు 1,100 మంది బ్రాహ్మణులు ఒకేసారి సప్తశతి చేసి, నాలుగు వేల పారాయణాలు చేస్తారు. ► రెండోరోజు 1,100 మంది బ్రాహ్మణులు రెండు పారాయణాలు చేసి, మూడు వేల జపాలు చేస్తారు. ► మూడో రోజు 1,100 మంది బ్రాహ్మణులు మూడు పారాయణాలు, రెండు వేల జపాలు చేస్తారు. ► నాలుగో రోజు 1,100 మంది బ్రాహ్మణులు 4 పారాయణాలు, వేయి జపాలు చేస్తారు. ► చివరి రోజు ఒక్కో హోమం గుండం వద్ద పదకొండు మంది రుత్విక్కులు పాలతో పది వేల పారాయణాలు, దశాంశం వేయిసార్లు తర్పణలిచ్చి, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ► 400 మంది బ్రాహ్మణులు రుత్విక్కులకు సేవలు అందిస్తారు. ప్రత్యేక ఏర్పాట్లు.. ► {బాహ్మణుల కోసం 4 యాగశాలలు ► వారు అక్కడే ఐదు రోజులు ఉండేందుకు వీలుగా వసతులు ► చండీయాగంలోకి రుత్విక్కులకే అవకాశం ► వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు వేర్వేరుగా.. భక్తులు, ప్రజల కోసం వేరుగా ఏర్పాటు ► రోజూ పది వేల నుంచి అరవై వేల మందికి భోజన ఏర్పాట్లు ► {పతి గ్యాలరీ వద్ద చండీయాగం చూసేందుకు టెలివిజన్ సెట్లు.. నిఘా కోసం సీసీ కెమెరాలు ► మీడియాకు ప్రత్యేక గ్యాలరీ, వారికి ఎప్పటికప్పుడు సమాచారం ► {పతి రోజూ సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హరికథలు ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 40 మంది హరినాథులు హాజరు ► ఎర్రవల్లి, శివారువెంకటాపూర్, గంగాపూర్, వర్ధరాజ్‌పూర్ గ్రామాల వద్ద 10 పార్కింగ్ స్థలాలు ► ఎర్రవల్లి మీదుగా ప్రజలు, నాయకులు వెళ్లేందుకు ఏర్పాట్లు ► వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అతిథులకు శివారు వెంకటాపూర్ నుంచి ప్రవేశం పనుల వేగం పెంచాలి: సీఎం కేసీఆర్ చండీయాగం పనుల వేగం పెంచాలని నిర్వాహకులకు సీఎం కేసీఆర్ సూచించారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా ఎర్రవల్లి సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మొదట చండీయాగం స్థలానికి చేరుకుని పరిశీలించి, పనులపై ఆరా తీశారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది. సీఎం అరగంటపాటు అక్కడే ఉండి పనుల గురించి తెలుసుకున్నారు. ఎస్పీ సుమతి ముందుస్తుగానే ఫాంహౌస్‌కు చేరుకుని పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. రాత్రి వ్యవసాయ క్షేత్రంలోనే బస చేస్తారు. ఆదివారం ఉదయం చండీయాగం పనులను మళ్లీ పరిశీలించనున్నట్లు సమాచారం. అలాగే ఎర్రవల్లిలో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది.