
యాగం పరిపూర్ణం
సకల జనహితం, సస్య సమృద్ధిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన అయుత చండీ మహాయాగం ఆదివారంతో పరిపూర్ణమైంది.
అయుత చండీయాగం చివరిరోజు అగ్ని ప్రతిష్ట
* 70 లక్షల ఆహుతులు, 10 లక్షల నవార్ణ మంత్రాలతో ఆజ్యహోమం
* అమ్మవారికి 12 టన్నుల పరమాన్న ద్రవ్య తర్పణం
* యాగం ముగింపు సమయంలో అపశ్రుతి.. యాగశాలకు ఆగ్నేయ దిశలో చెలరేగిన మంటలు
* 45 నిమిషాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది
* అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి కేసీఆర్ మహారుద్రయాగం
* అగ్ని ప్రమాదంతో యాగస్థలికి రాకుండానే వెనుదిరిగిన రాష్ట్రపతి
* యాగస్థలిని శుద్ధి చేసి మహాపూర్ణాహుతి నిర్వహించడంతో ముగిసిన క్రతువు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
సకల జనహితం, సస్య సమృద్ధిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన అయుత చండీ మహాయాగం ఆదివారంతో పరిపూర్ణమైంది. పసుపువర్ణ వస్త్రాల్లో వచ్చిన 1,100 మంది రుత్విక్కులు నవార్ణ మంత్ర జపాలు చేస్తుండగా చండీమాతకు సీఎం 70 లక్షల ఆహుతులు, 10 లక్షల నవార్ణ మంత్రాలతో 12 టన్నుల పరమాన్న ద్రవ్యాన్ని ఆజ్యహోమ తర్పణం చేశారు. రెండు టన్నుల గంధపు చెక్కలతో హోమ గుండాలను వెలిగించారు. 4 రోజులపాటు ప్రశాంతంగా సాగిన యాగంలో చివరిరోజు అపశ్రుతి దొర్లింది.
రాష్ట్రపతి ప్రణబ్ చండీ మాతకు మహా పూర్ణాహుతి ఇచ్చి యాగం పరిసమాప్తి చేసే క్రతువు మాత్రమే మిగిలి ఉందనగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 10 నిమిషాల్లో రాష్ట్రపతి మంటపం వద్దకు చేరుకుంటారనగా యాగశాలకు మంటలు అంటుకోవడం తో రుత్విక్కులు అగ్నిహోమం చేసే యాగశాల ప్రధాన మంటపం చాలావరకు అగ్నికి ఆహుతైంది. దీంతో రాష్ట్రపతి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రమాదానికి కొద్ది గంటల ముందే ఏపీ సీఎం చంద్రబాబు యాగానికి వచ్చి వెళ్లారు. ప్రమాదం తర్వాత కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దంపతులతో కలసి మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
నవార్ణ జపాలకు తొలిసారి విఘ్నం
శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి పంపిన ప్రత్యేక పట్టు వస్త్రాలు ధరించిన సీఎం కేసీఆర్ దంపతులు ఉదయం 8.30కి యాగశాల ప్రవేశం చేశారు. మహా సరస్వతి, మహాకాళి, వరలక్ష్మి విగ్రహాల వద్ద గురు ప్రార్థన చేశారు. గోపూజ, గణపతి హోమం తదితర పూజలు చేశారు. మహా పూర్ణాహుతికి ఆరంభంగా ఉదయం 9.40 గంటలకు రాజశ్యామల మంటపంలోని ప్రధాన హోమ గుండంలో అగ్నిప్రతిష్ట చేశారు. ఈ హోమ గుండంలోని అగ్నితోనే మిగతా 100 హోమగుండాలను వెలిగించారు. ఒక్కో హోమ గుండం వద్ద 11 మంది రుత్విక్కులు హోమం మొదలు పెట్టారు. పరమాన్నం, పూలు, పండ్లు, తమలపాకులతో ఆజ్యహోమం చేశారు. 10.20 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యాగశాలకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు మంత్రి హరీశ్‌రావు స్వాగతం పలకగా.. యాగశాల ప్రధాన ద్వారం వద్ద రుత్విజులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
చంద్రబాబు, ఆయన వెంట వచ్చిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఉన్నారు. వీరు మొదటి యాగశాలలో ప్రదక్షిణ చేశారు. అనంతరం కేసీఆర్ వారిని శివపార్వతుల విగ్రహం వద్దకు తీసుకెళ్లారు. రాజశ్యామల మంటపంలో కేసీఆర్, చంద్రబాబు మహారుద్ర యాగంలో పాల్గొన్నారు. తన వెంట తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు, పండ్లు, పూలను చంద్రబాబు.. మహారుద్రయాగం హోమగుండానికి సమర్పించారు. బాబు వచ్చిన సమయంలోనే యాగశాలలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో రుత్వికులు నవార్ణ మంత్ర జపాలను ఆపేసి కాసేపు బయటికి వెళ్లిపోయారు. ఇప్పటివరకు నిర్విఘ్నంగా కొనసాగిన నవార్ణ మంత్ర జపాలకు తొలిసారి బ్రేక్ పడినట్లు అయింది. యాగనిర్వాహకులు ఒక దిశలో మాత్రమే ఫ్యాన్లు నడిపి పొగను బయటికి పంపడంతో 30 నిమిషాల అనంతరం రుత్వికులు హోమగుండాల వద్దకు వచ్చి కూర్చున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కేసీఆర్ మళ్లీ మహారుద్రయాగం ప్రారంభించారు. కాళీ మాతకు పట్టు వస్త్రాలు, అరటి, కమలాలు, దానిమ్మ, ఆపిల్, జామ, మామిడి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం తదితర ఫలాలతో పాటు, పసుపు, కుంకుమతో పూర్ణాహుతి సమర్పించారు.
ఆహుతైన ప్రధాన యాగ మంటపం
మధ్యాహ్నం 12.30కి రుత్వికులు నవార్ణ మంత్ర జపాలు పూర్తి చేశారు. చండీమాతకు అంతిమ పూర్ణాహుతి ఇవ్వడం ద్వారా యాగం పరిసమాప్తం చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రపతి రాక కోసం ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపు ఆపివేశారు. ఈ లోగా కొద్దిసేపు విరామం ఇవ్వడంతో 80 శాతం మంది రుత్వికులు యాగశాల వదిలి బయటికి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో అంటే మధ్యాహ్నం 1.05 గంటలకు ఒక హోమగుండం వద్ద మిగిలిపోయిన ఆవు నెయ్యిని గుండంలోకి గుప్పించారు. దీంతో ఒక్కసారిగా యాగశాల ఆగ్నేయ దిశలో అగ్ని కీలలు పైకి లేచి యాగశాల పై కప్పును తాకాయి. అప్పటికే పొగతో వేడిగా మారిన పైకప్పు గడ్డి ఒక్కసారిగా అంటుకుంది. దీంతో రుత్విక్కులు యాగం చేసే ప్రధాన యాగ మంటపం 80 శాతం అగ్నికి ఆహుతైంది. అయిదు నిమిషాల్లోనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాలుతున్న యాగశాలపైకి ఎక్కి యంత్రాల సాయంతో నీళ్లు చల్లడంతో మంటలు కొంత తగ్గుముఖం పట్టాయి.
20 నిమిషాల పాటు హెలికాప్టర్‌లోనే ప్రణబ్
మధ్యాహ్నం 1.28 గంటలకు రాష్ట్రపతి హెలికాప్టర్లు వచ్చాయి. ఒక హెలికాప్టర్ యాగశాల చుట్టూ చక్కర్లు కొట్టింది. రాష్ర్టపతి హెలికాప్టర్‌తోపాటుగా మరో పైలట్ హెలికాప్టర్ యాగశాలకు కిలోమీటర్ దూరంలో శివారు వెంకటాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగాయి. మంటలు అదుపులోకి వస్తే మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి సిద్ధమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు రాష్ట్రపతి హెలికాప్టర్‌లోనే వేచి ఉన్నారు. అయితే రాష్ట్రపతి చీఫ్ సెక్యూరిటీ అధికారి నుంచి అనుమతి రాకపోవడంతో ప్రణబ్ ముఖర్జీ తిరిగి వెళ్లిపోయారు.
యాగస్థలిని సంప్రోక్షణ చేసిన పండితులు
అగ్నిమాపక సిబ్బంది దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి మధ్యాహ్నం 2 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విశ్వామిత్ర అతిథి గృహంలోనికి తరలించారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత శృంగేరీ పీఠం శిష్యులు పురాణం మహేశ్వరశర్మ, ఫణిశశాంకశర్మ, గోపికృష్ణశర్మ వేదమంత్రాలతో యాగస్థలిని సంప్రోక్షణ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌ను పూర్ణకుంభంతో ఆహ్వానించి హోమం నిర్వహించారు.
చండీమాతకు అంతిమంగా మహాపూర్ణాహుతి సమర్పించి యాగాన్ని పరిపూర్ణం చేశారు. ఇందులో పరమాన్నంతోపాటు అయిదు టన్నుల బెల్లం, నాలుగు టన్నుల నెయ్యి వినియోగించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ వి.హనుమంత రావు, రిటైర్డ్ జడ్జి ఎల్.నరసింహరెడ్డి, సినీ ప్రముఖులు జమున, తనికెళ్ల భరణి, డి.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, చండీయాగం నిర్వహణ కోసం వార్త పత్రిక సీఎండీ గిరీష్ సంఘీ, జేఎంజే గ్రూపు చెర్మైన్ జేఎం జోషితో కలిసి రూ.25లక్షల విరాళం అందజేశారు.