
వణికిస్తున్న డెంగీ!
డెంగీతో విలవిల్లాడుతోంది. తీవ్ర జ్వరాలతో వణుకుతోంది. వారం రోజులుగా తండావాసులందరూ మంచం పట్టారు. విధిలేని పరిస్థితుల్లో బాధితులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
♦ తీవ్ర జ్వరాలతో సాధుతండా విలవిల
♦ మంచం పట్టిన బాధితులు
♦ జ్వరపీడితుల్లో బాలలే అధికం
♦ మురికి కూపంలా తండా
♦ స్పందించని అధికారులు
కంగ్టి: సాధుతండా.. డెంగీతో విలవిల్లాడుతోంది. తీవ్ర జ్వరాలతో వణుకుతోంది. వారం రోజులుగా తండావాసులందరూ మంచం పట్టారు. విధిలేని పరిస్థితుల్లో బాధితులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. చేతి చమురు వదులుతుందే తప్ప జ్వరాలు తగ్గడంలేదు. తండాలోని ప్రతి ఇంట్లో జ్వరపీడితులే కనిపిస్తున్నారు. కంగ్టి మండలం జమ్గి(బి) గ్రామ పంచాయతీ పరిధిలోని సాధుతండాలో సుమారు 90 కుటుంబాలున్నాయి. ఇప్పటికే 20 మందికి పైగా తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. తండాలో పారిశుద్ధ్యం లోపించడంవల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
బాబురావుకు చెందిన ఇద్దరు పిల్లలు అర్జున్ (6), అనిత (8) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వీరికి తడ్కల్, పొరుగు జిల్లా నిజామాబాద్‌లోని పిట్లంలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. గత నెలలో నిజామాబాద్‌కు చికిత్స నిమిత్తం తరలించగా అక్కడ వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఈ మేరకు రాత్రికి రాత్రే నిలోఫర్‌లో అడ్మిట్ చేయడంతో తమ పిల్లలు బతికారని తండ్రి ఆవేదనతో తెలిపాడు. 16 రోజుల పాటు అక్కడే ఉండి పిల్లలకు వైద్యం చేయించినట్లు తెలిపారు.
రూ.20వేలకు పైగా ఖర్చు చేసినా పరిసరాల్లో వైద్యం అందలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా సర్దార్ (18) అనే యువకుడు నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆదివారం ఇంటికి చేరుకున్నాడు. తె ల్ల రక్త కణాలు పడిపోయాయని వైద్యులు తెలిపినట్లు సర్దార్ చెప్పాడు. దాదాపు రూ.16 వేలు ఖర్చుచేసినా ఇంకా జ్వరంతో మంచంపట్టాడు. సర్దార్ ఇంట్లోనే మరో ఇద్దరు పిల్లలు అలకానంద (5), అజయ్ (3) తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. తండాకు చెందిన రోహిత్ (6), శివానంద్ (3), రోహన్ (6), సంధ్య (4), పౌర్ణిమ (5), శివకుమార్ (7), పూజ (4), అజయ్ (4), దామ్లానాయక్ (52) తీవ్ర జ్వరంతో విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా తడ్కల్, పిట్లం, నారాయణఖేడ్‌లలో వైద్యం అందించినట్లు జ్వరపీడితుల తల్లిదండ్రులు తెలిపారు. తండాలో మురికి పేరుకు పోవడంవల్లే దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు, పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తే మరింత మందికి జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి మోటారు వద్ద అపరిశుభ్రత నెలకొందని తెలిపారు.
కాల్వల్లో పేరుకున్న మురికి
మండలంలో అనేక గ్రామాలు, తండాల్లో మురికి కాల్వలను శుభ్రం చేయకపోవడం వల్లే జ్వరాలు ప్రబలడానికి కారణంగా తెలుస్తోంది. పరిసర గ్రామాలైన జమ్గి(బి), జమ్గి(కె), బాన్సువాడ, దామర్‌గిద్దా, ముర్కుంజాల్, రాసోల్ తదితర గ్రామాల నుంచి జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సంబంధిత అధికారులు పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే వైద్యాధికారులు తండాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.