నెరవేరనున్న‘నిర్మల్’ కల
ఎట్టకేలకు నిర్మల్ జిల్లా కల నెరవేరనుంది. స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రాంగం.. నిర్మల్ సాధన సమితి పోరాటం ఫలించనుంది.
మూడో జిల్లాగా సీఎం సుముఖం
నిర్మల్‌రూరల్ : ఎట్టకేలకు నిర్మల్ జిల్లా కల నెరవేరనుంది. స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రాంగం.. నిర్మల్ సాధన సమితి పోరాటం ఫలించనుంది. ఈ ప్రాంత వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మూడో జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తంచేయడంపై సర్వత్రా హర్షం నెలకొంది. మరోవైపు దసరా నుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాలని కేసీఆర్ పేర్కొనడంతో విభజన ప్రక్రియ వేగవంతమైంది. చారిత్రక ఖిల్లాగా, రాజకీయ కేంద్రంగా పేరొందిన నిర్మల్ నూతన జిల్లాగా కొత్తరూపు దిద్దుకోనుంది. ఇదివరకే కలెక్టర్ జగన్‌మోహన్, సీఎస్ రాజీవ్‌శర్మ ఇచ్చిన నివేదికలతోపాటు స్వయంగా గూగుల్ మ్యాప్ ద్వారా నిర్మల్ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. ఈ మేరకు భౌగోళికంగా నిర్మల్‌ను జిల్లా చేయాల్సిన అవసరముందని గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కొత్తగా ఏర్పడనున్న కొమురంభీం(మంచిర్యాల) జిల్లా కేంద్రం ఈ ప్రాంతవాసులకు దూరభారం అవుతోంది. ఈ నేపథ్యంలో ముథోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాలతో పాటు బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలాన్ని కలిపి మూడో జిల్లాగా నిర్మల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అందుబాటులోకి జిల్లా కేంద్రం..
మొదటి నుంచీ నిర్మల్ ప్రాంతవాసులకు జిల్లాకేంద్రం దూరభారంగానే ఉంది. ప్రధానంగా ముథోల్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆదిలాబాద్ వెళ్లాలంటే దాదాపు 160-180 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏ చిన్నపనికైనా రెండురోజుల సమయం వృథా అవుతోంది. దీంతో అధికారిక కార్యక్రమాలు మినహాయించి ఏ పనికైనా ముథోల్‌వాసులు నిజామాబాద్‌కు వెళ్తుంటారు. ఇక్కడి నుంచి నిజామాబాద్ కేవలం 35-50 కిలోమీటర్లు మాత్రమే. అందువల్లే నిర్మల్‌ను జిల్లా చేయని పక్షంలో తమను నిజామాబాద్‌లో కలుపాలని స్థానికులు డిమాండ్ చేశారు. జోనల్ వ్యవస్థ పరంగా నిజామాబాద్ ఆరో జోన్‌లో వస్తుండడం, బాసర ప్రాంతాన్ని పక్కజిల్లాలో కలిపితే వచ్చే వ్యతిరేకతల నేపథ్యం కూడా నిర్మల్ జిల్లా ఏర్పాటుకు కలిసి వచ్చింది. ప్రధానంగా ముథోల్ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే నిర్మల్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు కానుంది.
జిల్లా కార్యాలయాల పరిశీలన..
గతకొన్ని రోజులుగా నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ఊహాగానాలు వస్తుండడం, ప్రభుత్వం సైతం ఆ దిశగా సూచనలు ఇస్తుండడంతో స్థానిక అధికారులు ముందుగానే జిల్లా కార్యాలయాల ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టరేట్ కోసం పరిశీలించారు. ఇక ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు నిర్మల్‌లోనే ఉన్నాయి. పంచాయతీ రాజ్, నీటిపారుదల, మత్స్యశాఖ, భూగర్భ జలవనరుల శాఖ, పే అండ్ అకౌంట్స్ తదితర శాఖల జిల్లా కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఇటీవలే రూ.మూడున్నర కోట్లతో ఆధునాతనంగా నిర్మించిన ఆర్డీఓ కార్యాలయం సైతం అందుబాటులో ఉంది.