గోల్‌మాల్
తాడిపత్రి మండలం తలారిచెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ కోసం భూసేకరణలో అక్రమాలు జరుగుతున్నాయి.
-తలారి చెరువు సోలార్‌ప్లాంట్ భూసేకరణలో అక్రమాలు
–భూమి లేకపోయినా పరిహారం కోసం ఎత్తులు
–ఆలస్యంగా గుర్తించిన రెవెన్యూ అధికారులు
– ఆగిపోయిన 17 రిజిస్ట్రేషన్లు
–అజ్ఞాతంలోకి వీఆర్‌ఓ
తాడిపత్రి : తాడిపత్రి మండలం తలారిచెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ కోసం భూసేకరణలో అక్రమాలు జరుగుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, సిబ్బంది స్థానిక అధికార పార్టీ నేతలతో ఽకుమ్మక్కై గోల్‌మాల్ చేస్తున్నారు. భూములు లేని వారి పేరు మీద సైతం ఉన్నట్లు పట్టాలు సృష్టించి నిధులు కొల్లగొట్టేందుకు పథకం పన్నారు. ఇక్కడ 500 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ జెన్‌కో సంస్థ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం దాదాపు నాలుగు వేల ఎకరాలు సేకరిస్తోంది. ప్రస్తుతం తలారిచెరువు, ఆలూరు గ్రామాల్లో భూసేకరణ జరుగుతోంది. సేకరించనున్న భూముల్లో 106 ఎకరాల పట్టా, 80 ఎకరాల అసైన్డ్, మిగిలినవి ప్రభుత్వ భూములు ఉన్నాయి. పట్టా భూములకు ఎకరాకు రూ.4.25 లక్షలు, అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.3.72 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలైంది.
అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు రంగంలోకి దిగారు. పట్టాలుండి స్థానికంగా భూయజమానులు లేని వారు, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని వారి వివరాలను సేకరించారు. వారి స్థానంలో ఇతరుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నారు. ఇప్పటికే ఇలా 23 ఎకరాలకు పైగా బినామీల ఽపేర్లతో చేయించారు. ఇందుకు వీఆర్‌ఓ, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఽసహకారం అందజేశారు. పాసు పుస్తకాల్లో ఫోర్జరీ సంతకాలు చేశారు. తలారిచెరువు గ్రామానికి చెందిన 111, 97, 92, 94బీ సర్వే నంబర్లలో లొసుగులు ఉన్నాయని ఆలస్యంగా గుర్తించిన రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు జరిగిన 17 రిజిస్ట్రేషన్‌లను నిలుపుదల చేయించారు. ఒక వ్యక్తికి రెండెకరాలు ఉండగా ఏకంగా 32 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల్లో చూపారు.
అందులో కొంతమేర ఇతరులకు అమ్మినట్లు కనబరిచారు. సదరు వ్యక్తికి రూ.25లక్షల పరిహారం చెక్కు కూడా అందింది. అయితే..గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ చెక్కు డ్రా చేయకుండా బ్యాంకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో తలారిచెరువు వీఆర్‌ఓ గంగన్న పాత్రపై అనుమానం రావడంతో ఆయన మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భూసేకరణలో ‘బినామీల భాగోతం’ వెలుగులోకి రావడంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెవెన్యూ, ఏపీ జెన్‌కో అధికారులు సిద్ధమవుతున్నారు.
17 రిజిస్ట్రేషన్‌లు ఆపేశాం–ప్రసాద్, తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్
అసలైన రైతుల పట్టాలు, రికార్డులు చూసిన తర్వాత, వీఆర్‌ఓ అనుమతితోనే రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నాం. కొన్నింటిపై ఫిర్యాదులు రావడంతో రిజిస్ట్రేషన్‌లు ఆపేశాం. ఇప్పటి వరకు ఇలా 17 రిజిస్ట్రేషన్‌లను తాత్కాలికంగా ఆపేశాం. రెవెన్యూ అధికారుల అనుమతి తర్వాతనే ముందుకు వెళ్తాం.
విచారణ చేస్తున్నాం–యల్లమ్మ, తహశీల్దార్, తాడిపత్రి
పట్టా భూముల లబ్ధిదారుల విషయంలో కొన్ని పొరపాట్లు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, సవరణలు ఉన్న భూముల రికార్డులను పరిశీస్తున్నాం. తమవి కాని భూములను ఇతరులు ఎవరైనా రికార్డుల్లో నమోదు చేయించుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.


