డ్రైవర్‌కు బదులు క్లీనర్‌.. | cleaner instead of driver | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌కు బదులు క్లీనర్‌..

Sep 24 2016 11:18 PM | Updated on Sep 29 2018 5:26 PM

ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ను తొలగిస్తున్న జేసీబీ - Sakshi

ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ను తొలగిస్తున్న జేసీబీ

డ్రైవర్‌కు బదులుగా క్లీనర్‌ ట్యాంకర్‌ వాహనం అతివేగంగా నడపడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో లారీ దగ్ధమైన సంఘటన శుక్రవారం అర్థరాత్రి పెనుబల్లి మండల పరిధిలోని టేకులపల్లి వద్ద చోటు చేసుకుంది.

  • అతివేగంతో వాహనం నడిపిన క్లీనర్‌
  • మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
  • మరో లారీ దగ్ధం
  • తప్పిన పెను ప్రమాదం

  • పెనుబల్లి: డ్రైవర్‌కు బదులుగా క్లీనర్‌ ట్యాంకర్‌ వాహనం అతివేగంగా నడపడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో లారీ దగ్ధమైన సంఘటన శుక్రవారం అర్థరాత్రి పెనుబల్లి మండల పరిధిలోని టేకులపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వైజాగ్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌తో కూడిన ట్యాంకర్‌ వాహనం నిజామాబాద్‌ వెళుతూ మార్గమధ్యలో పెను ప్రమాదానికి కారణమైంది. ట్యాంకర్‌ డ్రైవర్‌ వంగా హరిచందర్‌రావు నిద్రపోతుండగా క్లీనర్‌ బత్తిని కృష్ణ వాహనాన్ని నడపడం ప్రారంభించాడు. మండల పరిధిలోని టేకులపల్లి రిత్విక్‌ పవర్‌ప్లాంట్‌ నుంచి మోడల్‌ స్కూల్‌ మధ్యలో రోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తి మృతి చెందిన కంగారులో ట్యాంకర్‌ను ఎవరికి దొరకకుండా ఉండేందుకు క్లీనర్‌ మరింత వేగం పెంచాడు. కొద్ది దూరం వెళ్లేలోపలే రాజస్థాన్‌ హోటల్‌ సమీపంలో ఎదురుగా రేకుల లోడుతో వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది. అయితే ప్రమాదానికి కారణమైన పెట్రోల్‌ ట్యాంకర్‌ పది మీటర్లలోపే ఉంది. ఒక వేళ మంటలు ట్యాంకర్‌కు ఎగబాకితే పెనుప్రమాదం జరిగేదని స్థానికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి రూరల్‌ సీఐ మడతా రమేష్‌, ఎస్సై గజ్జల నరేష్‌, కల్లూరు ఎస్సై బి. పవన్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్‌ ఇంజిన్‌కు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఖమ్మం-సత్తుపల్లి ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ వర్దపోగు గోవిందరావు లారీ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోవడంతో పోలీసులు రక్షించి పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి మృతదేహాన్ని పెనుబల్లి మార్చురీకి తరలించారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ క్లీనర్‌ బత్తిని కృష్ణ, డ్రైవర్‌ వంగా హరిచందర్‌రావులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గజ్జల నరేష్‌ తెలిపారు.  శనివారం ఉదయం రోడ్డుపై ఉన్న లారీ, ట్యాంకర్‌లను జేసీబీ సహాయంతో పక్కకు తొలగించారు.

    ఫొటో నెంబర్‌-24ఎస్‌పిఎల్‌86:
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement