ఆధారాలుంటేనే సీఐడీ విచారణ | CID inquiry | Sakshi
Sakshi News home page

ఆధారాలుంటేనే సీఐడీ విచారణ

Nov 13 2015 12:54 AM | Updated on Sep 2 2018 4:23 PM

ఆధారాలుంటేనే సీఐడీ విచారణ - Sakshi

ఆధారాలుంటేనే సీఐడీ విచారణ

సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న

సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సింగరేణి సంస్థ, జేఎన్టీయూ-హెచ్‌లు సంయుక్తంగా ప్రకటించాయి. పరీక్షల నిర్వహణపై సీఐడీ విచారణ నిర్వహించేందుకు ఆధారాల్లేవని, ఆధారాలు చూపిస్తే పరిశీలిస్తామన్నాయి. సింగరేణి డెరైక్టర్ పవిత్రన్ కుమార్, జేఎన్టీయూ నుంచి రాత పరీక్ష కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణ రావు, కో-కన్వీనర్ జి.కె. విశ్వనాథ్ గురువారం ఇక్కడ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సింగరేణి  విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించగా ఒక్క ఆధారమూ లభ్యం కాలేదని చెప్పారు.

పరీక్షల నిర్వహణ పూర్తిగా జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరిగిందని, కట్టుదిట్టంగా జరిగిన ఈ పరీక్షల్లో అక్రమాలకు ఆస్కారం లేదని పవిత్రన్ కుమార్ తెలిపారు. మెరిట్ జాబితాల ప్రకటన తర్వాతే ఆరోపణలు ప్రారంభమయ్యాయన్నారు. సోషల్ మీడియాలో ఆరోపణలు ఎవరు చేస్తున్నారో తెలియడం లేదని, ఈ-మెయిల్ ఐడీ ఆధారంగా వారిని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఫిర్యాదుదారుల వద్దకు విజిలెన్స్ అధికారులు వెళ్లి విచారణ జరపగా.. తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణల ఆధారంగా ఫిర్యాదు చేశామన్నారని చెప్పారు.
 
 అర్ధంతరంగా ముగిసిన సమావేశం
 సింగరేణి, జేఎన్టీయూ-హెచ్ విలేకరుల సమావేశం అర్ధంతరంగా ముగిసింది. చివర్లో విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించడంతో అసహనానికి గురైన సింగరేణి డెరైక్టర్ పవిత్రన్ కుమార్ జేఎన్టీయూ ప్రొఫెసర్లతో కలసి అక్కడి నుంచి నిష్ర్కమించారు. విలేకరుల ప్రశ్నలకు పవిత్రన్ కుమార్ ఇచ్చిన కొన్ని సమాధానాలు ఇలా వున్నాయి..

 ప్రశ్న: మంచిర్యాల సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారు. ఓ మంత్రి, అక్కడి ఎమ్మెల్యే పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి?
 పవిత్రన్: మంచిర్యాల కేంద్రం నుంచి 30 నుంచి 35 వరకు ఎంపిక కానున్నారు. ఇంటిపేరు ఆధారంగా మెరిట్ లిస్టును సెర్చ్ చేసి ఆరోపణలు చేస్తున్నారు.
 ప్రశ్న: ఆరోపణలు నిజమని తేలితే ఏం చేస్తారు? మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా?
 పవిత్రన్: బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తాం.
 ప్రశ్న: సింగరేణి మీద ఆరోపణలు వచ్చినప్పుడు అదే సంస్థలో అంతర్భాగమైన విజిలెన్స్‌తో విచారణ జరిపిస్తే ఎలా? సీఐడీతో విచారణ జరిపిస్తారా?  
 పవిత్రన్: ఆధారాలు పట్టుకుని వస్తే.. చర్యలు తీసుకుంటాం. (పదేపదే ఇదే ప్రశ్నను లేవనెత్తగా ఆయన అసహనంతో వెళ్లిపోయారు)
 
 విచారణలో వెలుగు చూసిన అంశాలు
 ఒకే కుటుంబం నుంచి ‘బంటి’ ఇంటి పేరుతో 70 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ ఇంటి పేరుతో ఐదుగురుమాత్రమే ఎంపికయ్యారు. వీరిలో బీసీ-ఏ నుంచి ఒకరు, బీసీ-బీ నుంచి ఒకరు, బీసీ-డీ నుంచి ముగ్గురున్నారు.
  బండారు ఇంటిపేరుతో ఇద్దరు కవలలు ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది. వీరికి ఒకే పర్సెంటేజ్‌లో మార్కులొచ్చినా ఉద్యోగాలకు ఎంపిక కాలేదు. 150 ప్రశ్నలకు వీరిచ్చిన సమాధానాల్లో 65 వేర్వేరుగా ఉన్నాయి.
  ఒకే కుటుంబం నుంచి ఇద్దరిద్దరు చొప్పున మొత్తం 106 మంది ఎంపికైనట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ, కేవలం 4 కుటుంబాల నుంచి 8 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఎంపికయ్యాయి.
  40-80 మంది అభ్యర్థులు మంచిర్యాలలోని నాగార్జున కాలనీ నుంచి ఎంపికయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ కాలనీ నుంచి ఒకే అమ్మాయికి ఉద్యోగం రానుంది.
  పరీక్షా కేంద్రం ఆధారంగా పరిశీలించి చూశాం. ఒక సెంటర్ నుంచి 4 లేదా 5 మందికి మించి ఎంపిక కాలేదు. ఏ సెంటర్‌లోనూ మాస్ కాపీయింగ్ జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement