Sakshi News home page

టీడీపీ నాయకులు దద్దమ్మలు

Published Sun, May 21 2017 3:34 AM

టీడీపీ నాయకులు దద్దమ్మలు - Sakshi

► ధైర్యం ఉంటే ఎయిర్‌పోర్టుపై సీఎంను నిలదీయాలి
►  ముడుపులు అందలేదని ల్యాండ్‌పూలింగ్‌ ఎక్స్‌పర్ట్‌ మౌనం
► పార్టీలకతీతంగా పోరాటానికి సిద్ధం కావాలన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాకాణి, రామిరెడ్డి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): దగదర్తి మండలంలోని దామవరంలో ఎయిర్‌పోర్ట్‌ను రద్దు చేసి ఇతర జిల్లాకు తరలిస్తామని పెట్టుబడులశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపినా టీడీపీ జిల్లా నాయకులు, మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని మాగుంటలేఅవుట్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు తీసుకొచ్చిన ఎయిర్‌పోర్టును చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని, ఈ విషయంపై టీడీపీ నాయకులు స్పందించి సీఎం చంద్రబాబును నిలదీయాలని అన్నారు. మొదటి నుంచి టీడీపీ ప్రభుత్వం ఈ ఎయిర్‌పోర్టుపై భిన్నంగా వ్యవహరిస్తోందని, మొదట 2,200 ఎకరాలు అవసరమని, మరలా 600 ఎకరాలు సరిపోతాయని, 13 ఎకరాలు అవసరమవుతాయని, విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ వస్తోందని అన్నారు. చివరకు రైతులకు నష్టపరిహారం కింద ఇవ్వాల్సిన రూ.15 కోట్లు  ఇవ్వడం ఇష్టంలేక ఎయిర్‌పోర్టును రద్దు చేశారన్నారు. టెండర్లు ఖరారయిన తర్వాత రద్దు నిర్ణయం ఏమిటని ప్రశ్నించారు.

ముడుపులు అందకపోవడంతోనే..
ల్యాండ్‌ పూలింగ్‌ ఎక్స్‌పర్ట్‌ సీఎం చంద్రబాబుకు ముడుపులు అందకపోవడంతోనే ఎయిర్‌పోర్టును రద్దు చేశారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ ప్రయాణానికి అయ్యే విమాన ఖర్చులంత లేని రూ.15 కోట్లు ఇవ్వడం ఇష్టం లేకనే ఎయిర్‌పోర్టు రద్దు చేశారని అన్నారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు పార్టీలకతీతంగా కలసిరావాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే కొందరు టీడీపీ నాయకులు ఈ ప్రాంతంలోని భూముల రికార్డులను తారుమారు చేసి ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారని, వారి ఒత్తిడి మేరకే ఎయిర్‌పోర్టు రద్దు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. రద్దు నిర్ణయాన్ని ఇప్పటికైనా పునరాలోచించాలని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బీద రమేష్, అల్లూరు మండల కన్వీనర్‌ దండా కృష్ణారెడ్డి, కావలి కౌన్సిలర్‌ తిరుపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement