దీని బండ బడా.. ఎద్దుల బండి మేలురా! | Sakshi
Sakshi News home page

దీని బండ బడా.. ఎద్దుల బండి మేలురా!

Published Sat, Mar 18 2017 11:45 PM

దీని బండ బడా.. ఎద్దుల బండి మేలురా!

- కడప- నంద్యాల డెమూ ప్యాసింజర్‌పై ప్రయాణికుల అసంతృప్తి
- ట్రాక్‌ పటిష్టతలో లోపాలు.. 30 కి.మీ.కి మించని పరుగు
- ఎండింగ్‌ పాయింట్‌కు ముందు గంటల తరబడి నిలిపివేత
 
అసలే కొత్త ట్రాక్‌.. ఆపై సాంకేతిక లోపాల భయంతో ట్రైన్‌ స్పీడును 60 కి.మీ.లుగా  నిర్ణయించగా అమలులో ఆ వేగం 50కి మించలేదు. కొంతకాలం కొనసాగిందో లేదో ట్రాక్‌లో లోపాలు బయటపడడంతో ఇంజిన్‌ డ్రైవర్లు 30 కి.మీ.కు మించి స్పీడుగా నడపకపోవడంతో నంద్యాల-కడప పర్వాలేదనిపించినా కడప-నంద్యాల(77404) డెమూ ప్యాసింజర్‌ ప్రయాణం మాత్రం ఎద్దుల బండిని తలపిస్తోంది.
 
నంద్యాల: ఎర్రగుంట్ల- నంద్యాల మార్గంలో ఇటీవలే పట్టాలెక్కిన కడప-నంద్యాల డెమూ ప్యాసింజర్‌ పరుగులో ఎద్దుల బండితో పోటీ పడుతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్‌ ఉందన్న మాటే కానీ గంటల తరబడి ప్రయాణం.. ఎక్కడిక్కకడ ఆపేయడం కారణంగా ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. కడపలో బయల్దేరిన రైలు గంటల జాప్యంతో 30కి.మీ వేగంతో నంద్యాలకు చేరుకుంటోంది. కొత్తలైన్‌ పనులు పూర్తికాకపోవడం, అక్కడక్కడ లోపాలు తలెత్తడంతో అధికారులు పూర్తిస్థాయి వేగంతో రైలును తిప్పడానికి సాహించడం లేదు. మే 16 నుంచి ఈలైన్‌పై ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుపుతామని రైల్వే అధికారులు ప్రకటించినా ట్రాక్‌ పనులు చూస్తే అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. 
 
లోపాల సవరణకు గడువు ముగిసినా..
123 కి.మీ.నిడివి కల్గిన నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను రూ.9.50కోట్లతో నిర్మించారు. గత ఏడాది ఆగస్టు 23న రైల్వేమంత్రి సురేష్‌ప్రభు, సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత డెమూ రైలు, గూడ్స్‌ రైలు రాకపోకలు మొదలయ్యాయి. అయితే ట్రాక్‌ నిర్మాణంలో పలు చోట్ల లోపాలు బయటపడడం, రైలు రాకపోకల కారణంగా కుంగిపోవడాన్ని  గుర్తించిన సాంకేతిక నిర్మాణ సంస్థ నిర్ణీత ఆరు నెలల వ్యవధిలో పటిష్టం చేసి రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంది. అయితే ఈ గడువు జనవరికే పూర్తయినా ఇప్పటి వరకు ట్రాక్‌ను అధికారికంగా అప్పగించలేదు. ఇదే ట్రాక్‌పై మే 16 నుంచి విజయవాడ-ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ రైలును తిప్పుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సాంకేతిక రైలును తెప్పించి ట్రాక్‌ను పటిష్టత పనులు చేస్తున్నారు. అయితే పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తికాకుంటే ఎక్స్‌ప్రెస్‌ రైలు రాకపోకలు అనుమానమే.
 
 60 కి.మీ. వేగంతో వెళ్లాల్సి ఉన్నా..
 వాస్తవానికి ఈ రైలు ట్రాక్‌పై 60కి.మీ.వేగంతో వెళ్లాల్సి ఉంది. అయితే ట్రాక్‌ పటిష్టంగా లేకపోవడంతో వేగాన్ని 50కి తగ్గించారు. దీనికితోడు ట్రాక్‌ పటిష్టంగా లేకపోవడం, స్టాపింగ్‌ల కారణంగా నంద్యాల నుంచి ఉదయం 6గంటలకు బయల్దేరిన రైలు 11 గంటలకు కానీ కడప చేరుకోవడం లేదు. తర్వాత అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20గంటలకు రావాల్సిన రైలు 4గంటలకు చేరుతుంది. తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరిన రైలు కడపకు రాత్రి 8గంటలకు చేరుతుంది.
 
అక్కడి నుంచి బయల్దేరిన రైలు(77404) రాత్రి సమయంలో ప్రయాణించి రావడంతో స్పీడును 30కి.మీ. కే పరిమితం చేశారు. ఫలితంగా నిర్ణీత సమయానికి రెండు గంటలు అంటే నంద్యాలకు 22.30 గంటలకు రావాల్సి ఉండగా అర్ధరాత్రి 12 గంటలు దాటుతోంది. ఈ సమయంలో క్రాసింగ్‌ ఉంటే నంద్యాల శివారులోని వెంకటేశ్వరపురం వద్ద సుమారు గంటకుపైగా నిలిపేస్తుండడంతో ఇదెక్కడి రైలురా బాబు అంటూ ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. 
 

Advertisement
 
Advertisement