బరులు రె‘ఢీ’ .. | All arranged for the Cock fight | Sakshi
Sakshi News home page

బరులు రె‘ఢీ’ ..

Jan 13 2017 10:17 PM | Updated on Aug 31 2018 8:31 PM

బరులు రె‘ఢీ’ .. - Sakshi

బరులు రె‘ఢీ’ ..

సంక్రాంతికి జిల్లాలో కోడిపందేలు, పేకాటకు తెర తీస్తున్నారు. కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించడంతో గురువారం

  •  జిల్లాలో కోడి పందేలకు పక్కా ఏర్పాట్లు
  •  వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు.. పేకాటకు గదులు
  •  భోగి పండుగనాడు ప్రారంభించాలని ఉవ్విళ్లు
  •  పోలీస్, రెవెన్యూ అధికారులకు మామూళ్లు
  • మచిలీపట్నం : సంక్రాంతికి జిల్లాలో కోడిపందేలు, పేకాటకు తెర తీస్తున్నారు. కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించడంతో గురువారం సాయంత్రం వరకు పరిస్థితి తుపాను ముందు ప్రశాంతతలా ఉంది. పోలీసులు కోడిపందేలు వేసేందుకు అనుమతులు లేవని చెబుతుండడంతో పందెంరాయుళ్లు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం ఉదయానికి పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని పందెం రాయుళ్లు ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం భోగి పండుగ కావటంతో  ఆ రోజు నుంచి పందేలు వేసేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందేల శిబిరాల వద్ద పేకాట తదితర జూదాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

    జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నిర్వాహకులకు టీడీపీ నేతల అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది.  పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు అప్పనవీడులో కోడిపందేలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ బరిలో వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, పేకాట ఆడేందుకు ప్రత్యేక గదులను సిద్ధం చేస్తున్నారు. కోడిపందేలకు సంబంధించి ఒక్కొక్క బరికి రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు నగదు చేతులు మారుతోంది. నిర్వాహకులు రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు మామూళ్లు అందజేస్తున్నట్టు సమాచారం. దీంతో కోడిపందేలు నిర్వహించే వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండానే బరులను ఏర్పాటు చేయటం గమనార్హం.  అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కత్తులు కట్టకుండా కోడిపందేలు వేసుకోవచ్చని సూచనప్రాయంగా చెబుతుండడం గమనార్హం. పెనమలూరు నియోజకవర్గం ఈడ్పుగల్లులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పెదపులిపాకలో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ కోడిపందేలను గురువారమే ప్రారంభించారు.

    జిల్లా వ్యాప్తంగా బరులు సిద్ధం
    ► నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి,  తుక్కులూరు, సీతారామపురం, రావిచర్లతోపాటు చాట్రాయి మండలం జనార్ధనవరం, ఆగిరిపల్లి మండలం ఈదర, శోభనాపురంలలో బరులను ఏర్పాటు చేసి పందేలకు సిద్ధమవుతున్నారు.
    ► అవనిగడ్డ నియోజకవర్గంలోని వెంకటాపురం, నడకుదురు, కొడాలి, శ్రీకాకుళం, మొవ్వ, పెదకళ్లేపల్లి, బార్లపూడి, భట్లపెనుమర్రులలో ఇప్పటికే బరులను సిద్ధం చేశారు.
    ► బందరు మండలం గోపువానిపాలెం, మేకవానిపాలెం, శ్రీనివాస నగర్‌లలో బరులను సిద్ధం చేశారు. మచిలీపట్నంలోని ఓ పాఠశాల పక్కనే బరిని సిద్ధం చేశారు.
    ► కైకలూరు మండలం కొల్లేటికోట, భుజబలపట్నంలలో బరులను సిద్ధం చేశారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు  కైకలూరులోనే మకాం చేయడంతో కోడిపందేల బరులను శుక్రవారం ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైందని   సమాచారం.
    ► పెడన మండలం కొంకేపూడి, బల్లిపర్రు, కూడూరు, గూడూరు – పెడన అడ్డరోడ్డు సెంటరులలో, బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట, పెందుర్రు, ఆర్తమూరు, నాగన్న చెరువులలో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement