
కెనడాలో ఘనంగా తెలంగాణ నైట్ ఉత్సవాలు
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం కెనడా(టీడీఎఫ్‌సీ) నిర్వహించిన తెలంగాణ నైట్-2016 ఉత్సవాలు కెనడాలోని మిస్సిసాగా నగరంలో ఘనంగా జరిగాయి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం కెనడా(టీడీఎఫ్‌సీ) నిర్వహించిన తెలంగాణ నైట్-2016 ఉత్సవాలు కెనడాలోని మిస్సిసాగా నగరంలో ఘనంగా జరిగాయి. గ్రేటర్ టొరంటోతో పాటు కెనడాలోని వివిధ నగరాల నుంచి 800 మందికి పైగా తెలంగాణ వాసులు హాజరై కార్యక్రమాన్ని విజయవం తం చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఒంటారియో ప్రావిన్స్ ఆరోగ్య శాఖ మంత్రి దీపిక దామెర్ల హాజరయ్యారు. వారితోపాటు టీడీఎఫ్ గ్లోబల్, యూఎస్‌ఏ ప్రతినిధులు, హైదరాబాద్ డక్కన్ ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్ర గురించి కోదండరాం చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఆత్మీయ అతిథిగా హాజరైన ప్రముఖ తెలుగు కళాకారుడు లోహిత్ మిమిక్రీ సభికులను రంజింపచేసింది. ప్రముఖ తెలంగాణ సాహితీవేత్త, కవి డాక్టర్ ఎం.కులశేఖర్‌రావుని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సమ్మక్క, సారలమ్మల నృత్యం విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమం ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు విదేశాల్లో నిర్వహించి తెలంగాణ సంస్కృతిని పటిష్ట పరుస్తామని నిర్వాహకులు తెలిపారు.