
బెంగళూరు : పోలీసులు రౌడీషీట్ తెరవడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం చేళూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తకోటవాండ్ల పల్లిలో చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం రాజువాండ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఇళ్లు మంజూరు విషయమై లక్ష్మీ నారాయణతో పాటు మారెప్పరెడ్డి, రెడ్డెప్ప, ఈశ్వరరెడ్డిలు నల్లగుట్టపల్లి గ్రాపం పీడీఓ శ్రీనివాస్‌పై దాడి చేశారు. అందుకు సంబంధించి శ్రీనివాస్ చేళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేరే ప్రాంతంలో తలదాచుకున్నారు.
అయితే చేళూరు పోలీసులు నలుగురు వ్యక్తులను రౌడీషీటర్లుగా ప్రచారం చేస్తున్నారంటూ వార్తలు రావడంతో నెల రోజుల క్రితం చేళూరు పోలీసుస్టేషన్‌కు వచ్చిన మారెప్పరెడ్డి రౌడీషీట్ తెరవడంతో గ్రామంలో తమ పరువు, మర్యాదలు భంగం వాటిల్లుతోందని రౌడీషీట్ ఉపసంహరించుకోవాలంటూ ప్రాధేయపడ్డారు. అందుకు సంబంధించి గురువారం కూడా చేళూరు ఎస్‌ఐని కలవగా బాగేపల్లి తహశీల్దార్ వద్దకు వెళ్లాలంటూ సూచించడంతో మనస్తాపం చెందిన మారెప్పరెడ్డి ఇంటికి వచ్చి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.