అమ్మను సర్‌ప్రైజ్‌ చేస్తానని.. అనంత లోకాలకు

Young Man End Lives Cancel Flight Tickets From Gulf to India - Sakshi

22న బహ్రెయిన్‌ నుంచి స్వదేశం

వచ్చేందుకు ఫ్లైట్‌ టికెట్‌ కొనుగోలు

కరోనా భయంతో విమాన సర్వీసుల రద్దు

స్వదేశం చేరలేననే బెంగతో యువకుడి ఆత్మహత్య

రాజమహేంద్రవరం క్రైం: గల్ఫ్‌ దేశం వెళ్లి అప్పుల పాలయ్యాడు. స్వదేశం వచ్చి ఆటో నడుపుకొంటూ జీవిద్దామంటే అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. మరోసారి ఇతర దేశం వెళ్లి సంపాదించిన సొమ్ము తో అప్పులు తీర్చాలనుకున్నా డు. ఈ నేపథ్యంలో బహ్రెయిన్‌ దేశం వెళ్లి ఎలక్ట్రికల్‌ పనిలో కుదిరాడు. సవ్యంగా సాగుతున్న అతడి జీవితాన్ని కరోనా అర్ధాంతరంగా అతడి జీవితం ముగిసేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఉల్లితోట వీధి, బంగారయ్య స్కూల్లో నివశిస్తున్న వనపర్తి లక్ష్మి, వనపర్తి వెంకటేశ్వరరావుల ఇద్దరు సంతానంలో కుమారుడు వనపర్తి మహేష్‌ కాగా, కుమార్తె రత్నం. కుమార్తెకు వివాహం చేశారు. మహేష్‌ కొంతకాలం క్రితం అప్పు చేసి గల్ఫ్‌ దేశం వెళ్లి వచ్చాడు.

అయినప్పటికీ చేసిన అప్పులు తీర్చకపోవడంతో రుణదాతల నుంచి అతడిపై ఒత్తిడి ఎక్కువైంది. ఉన్న ఆటో అమ్ముకొని, మరికొంత అప్పు చేసి బహ్రెయిన్‌ దేశం వెళ్లాడు. అక్కడికి వెళ్లాక మహేష్‌ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దాంతో తిరిగి ఇండియా వచ్చేసేందుకు మార్చి 22న అతడు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అదే రోజు అతడు తన చెల్లెలికి ఫోన్‌ చేసి తాను వస్తున్న విషయం చెప్పాడు. తల్లికి చెప్పవద్దని సర్‌ప్రైజ్‌గా వస్తానని చెప్పాడు. తీరా చూస్తే మార్చి 22న అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దాంతో మహేష్‌ తీవ్రంగా కలత చెందాడు. ఇక ఇప్పట్లో స్వదేశం వెళ్లలేననే బెంగతో రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల పాలిట ఈ వార్త ఆశనిపాతంలా మారింది. సర్‌ప్రైజ్‌గా వస్తాడని చెప్పి అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ మహేష్‌ తల్లి లక్ష్మి, తండ్రి వెంకటేశ్వరరావు, చెల్లెలు రత్నం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

కడసారి చూపునకు నోచుకోని వైనం  
ఒక్కగానొక్క కొడుకు కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి మృతదేహం తీసుకురావాలంటే కనీసం రెండు నెలలు పడుతుందని, అప్పటి వరకూ మృతదేహాన్ని భద్రపరిచేందుకు మార్చరీలు ఖాళీగా లేవని ఇండియన్‌ ఎంబసీ వారు తెలిపారని వారు చెప్పారు. కరోనా వైరస్‌ విజృంభించడంతో మృతదేహాలు భద్రపరిచేందుకు ఒప్పుకోవడం లేదని పేర్కొంటున్నారు. అంత్యక్రియలు నిర్వహించినట్లు వాట్సాప్‌ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఏజెంట్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top