ప్రియుడి నుంచి వేరుచేశారని విద్యార్థిని ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ప్రియుడి నుంచి వేరుచేశారని విద్యార్థిని ఆత్మహత్య

Published Mon, Oct 14 2019 5:14 AM

Women Suside In Chittoor District - Sakshi

శాంతిపురం(చిత్తూరు జిల్లా): కోరుకున్నవాడి నుంచి వేరు చేశారనే మనస్తాపంతో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రెడ్లపల్లికి చెందిన చందన (18) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్‌ఐ మురళీమోహన్, స్థానికుల కథనం మేరకు.. రెడ్లపల్లికి చెందిన వెంకటేశు రెండో కుమార్తె చందన కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. పొరుగున ఉన్న ఒడ్డుమడికి చెందిన ప్రభుతో ప్రేమలో పడ్డ చందన గత శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం వెతికిన కుటుంబ సభ్యులు కుప్పంలో ఉన్నట్టు తెలుసుకుని శనివారం మధ్యవర్తుల ద్వారా ఇంటికి తీసుకువచ్చారు. ఆమెను మందలించిన అనంతరం తండ్రి పంటలకు ఎరువుల కోసం శాంతిపురానికి వెళ్లిపోయాడు. సాయంత్రం 5 గంటల సమయంలో తల్లి అమరావతి ఇంటి బయట పనిలో ఉండగా చందన ఇంట్లోని దూలానికి ఉరివేసుకుంది.

ఇంట్లోకి వచ్చిన తల్లి చూసి కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి కిందికి దింపేలోపే ప్రాణాలు కోల్పోయింది.తండ్రి వెంకటేశు గ్రామస్తులకు విషయం తెలిపి ఈ విషయం బయటకు పొక్కితే మిగతా పిల్లల భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో శనివారం రాత్రి తమ వ్యవసాయ పొలం వద్ద గుట్టుగా మృతదేహాన్ని దహనం చేసేశారు. అయితే రెడ్లపల్లిలో పరువు హత్య జరిగిందని సోషల్‌ మీడియాలో ప్రచారం కావటంతో రాళ్లబూదుగూరు ఎస్‌ఐ మురళీమోహన్‌ సిబ్బందితో వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుప్పం సీఐ కృష్ణమోహన్, పలమనేరు డీఎస్పీ ఆరీపుల్లా ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులను– మృతురాలి కుటుంబ సభ్యులను వేర్వేరుగా విచారించారు. ఘటన జరిగిన సమయంలో మృతురాలి తండ్రి శాంతిపురంలోనే ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. సంఘటన స్థలంలో లభించిన ఆనవాళ్లు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చందన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
Advertisement
 
Advertisement