ఆడి కారు కోసం...ఇంట్లోనే నకిలీ కరెన్సీ ప్రింట్‌ చేసింది..

Woman Tries To Buy Audi With Money She Printed At Home - Sakshi

బెర్లిన్‌: ప్రతి ఒక్కరు తమ జీవితంలో సొంత ఇల్లు, కారు, పొలాలు ఇలా ఏదో ఒకటి సంపాదించాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతో కష్టపడి, రూపాయి.. రూపాయి కూడబెట్టి వాటిని సంపాదించుకుంటారు. మరికొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. అది వేరే విషయం. కానీ ఇంకో రకం మనుషులు ఉంటారు.. వారిని చూస్తే అమాయకులా.. అతి తెలివి తేటలు ఉన్నవారా అనే విషయం అంత సులువుగా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఒకటి జర్మనీలో చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువతి తనకు ఎంతో ఇష్టమైన ఆడి కారును కొనాలని భావించింది. దాని కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15వేల యూరోలు(రూ. 11లక్షల 57వేలు) ఫేక్ కరెన్సీ ముద్రించింది. నకిలీ నోట్లను గుర్తుపట్టిన షోరూం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానికంగా ఉండే కైసర్‌స్లేటర్న్ కారు షోరూంకు వెళ్లిన యువతి అక్కడి సిబ్బందితో మాట్లాడి తనకు కావాల్సిన ఆడి ఏ3 2013 మోడల్‌ను ఎంచుకుంది. అనంతరం కారు తాలూకు డబ్బులు చెల్లించేందుకు బిల్ కౌంటర్‌కు వెళ్లిందామె. అక్కడ 15వేల యూరోల ఫేక్ కరెన్సీ తీసి చెల్లించబోయింది. చూడగానే నకిలీ నోట్లు అని గుర్తు పట్టేలా ఉన్న ఆ కరెన్సీని చూసిన కౌంటర్ సిబ్బందికి నోటమాట రాలేదు. తేరకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సిబ్బంది. షోరూం వద్దకు వచ్చిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను విచారించగా కరెన్సీని తన ఇంట్లోనే ముద్రించినట్లు తెలిపింది. దాంతో ఆమె ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు ఇంక్‌జెట్ ప్రింటర్ దొరికింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top