
ఎడమచేతిపై పచ్చబొట్టు ఉండగా వేలికి ఉంగరం ఉంది. ధరించిన దుస్తులను బట్టి...
క్రిష్ణగిరి : సూళగిరి అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని మహిళను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహంపై బండరాళ్లు వేసి ఉడాయించారు. ఈ ఘటన శనివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సూళగిరి తాలూకా మేలుమలై సమీపంలోని బాలకొండరాయనదుర్గం వద్ద మహిళ హత్యకు గురైనట్లు తెలుసుకున్న స్థానికులు సూళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం డీఎస్పీ మీనాక్షి, పోలీసులు సంఘటనా స్థలానికెళ్లి పరిశీలించారు. హతురాలి ముఖం కనిపించకుండా కొండపై ఉన్న నీటి గుంతలోకి వేసి తలపై బండరాళ్లు వేసి ఉండగా వాటిని తొలగించారు. మృతదేహాన్ని పక్కకు తీసి పరిశీలించగా ఆమె వయస్సు 25నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని అంచనాకు వచ్చారు.
తలపై బలమైన గాయాలుండటంతో రాళ్లతోమోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఎవరనేది తెలియరాలేదు. ఎడమచేతిపై పచ్చబొట్టు ఉండగా వేలికి ఉంగరం ఉంది. ధరించిన దుస్తులను బట్టి మృతురాలు విద్యావంతురాలు అని తెలుస్తోంది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుంగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారా? లేక ఇతర కారణాలతో హత్యకు గురైందా? అనేది దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉందని పోలీసులు తెలిపారు.