వేధిస్తున్నాడని..

Wife Killed Husband With Her Boyfriend In Hyderabad - Sakshi

ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య

సీసీ కెమెరాల ఆధారంగా పట్టివేత నిందితుల అరెస్ట్‌   

నాగోలు: తరచూ తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో  రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. రాజమండ్రి సమీపంలోని గోకారం ప్రాంతానికి చెందిన తోట దుర్గారావు (40) డ్రైవర్‌గా పనిచేస్తూ చందానగర్‌లో ఉంటున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన లావణ్యను 2013లో రెండో వివాహం చేసుకున్నాడు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన లావణ్యను తన దూరపు బంధువు వీర రామకృష్ణతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో  రామకృష్ణ కూడా తల్లితండ్రులతో కలిసి నగరానికి వలస వచ్చి నేరేడ్‌ మెట్‌లో ఉంటూ శివశక్తి ఏజెన్సీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకు తమ ఇంటి సమీపంలోనే దుర్గారావు కుటుంబానికి ఇల్లు అద్దెకు ఇప్పించాడు. అయితే దుర్గారావుకు గుర్తుతెలియని వ్యాధులు ఉన్నట్లు తెలియడంతో లావణ్య అతడిని దూరం పెడుతోంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న దుర్గారావు ఆమెను వేధిస్తున్నాడు. గత నెల 31న అతను తన ఇంట్లో రామకృష్ణ ఇంట్లో ఉండటాన్ని చూసి లావణ్యతో గొడవపడ్డాడు. దీంతో ఇద్దరూ  ఐరన్‌ పైప్‌తో దుర్గారావు తలపై కొట్టి, చున్నీతో ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా రక్తాన్ని కడిగేసి మృతదేహాన్ని బెడ్‌కవర్‌లో చుట్టారు. మరుసరి రోజు రామకృష్ణ  మారుతి  వ్యాన్‌లో మృతదేహాన్ని తీసుకెళ్లి కీసర రహదారి సమీపంలోని పొదల్లో పడేశారు. తనిఖీలు చేస్తున్న కీసర పోలీసులు మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఓమ్నీ వ్యాన్‌ను గుర్తించారు. వ్యాన్‌ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా దుర్గారావు హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రామకృష్ణ, లావణ్యను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి ఓమ్నీ వ్యాన్, రెండు ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌ రెడ్డి, మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వర రావు, సీఐ రవికుమార్, ఐటీ సెల్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి, కీసర సీఐ ప్రకాశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top