భద్రత..గోవిందా

Vigilance Failure in TTD Safety - Sakshi

సుప్రభాత వేళ ముగ్గురు చొరబాటు

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం

గేట్‌ తాళాలు పగులగొట్టి ప్రవేశించినా గుర్తించలేని వైనం

విజిలెన్స్‌ డొల్లతనంపై విమర్శలు

తిరుమల: తిరుమలలో భద్రత కరువైందా..?? నిఘా వ్యవస్థ నిదరోతుందా.. అత్యంత నిఘా, భద్రత వ్యవస్థ కలిగివుందని చెప్పుకునే టీటీడీ విజిలెన్స్‌ విభాగం పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనం. డేగ కళ్లతో నిఘా ఉండే సప్తగిరులపై భద్రతా వైఫల్యం, విజిలెన్స్‌ అధికారు ల నిర్లక్ష్యం తాజాగా మరోసారి బట్టబయలైంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు భక్తులు గత శనివారం శ్రీవారి సుప్రభాత సమయంలో ఆలయానికి మూడో మార్గంగా ఉన్న తిరుమల నంబి ఆలయం పక్కన ఉన్న గేట్‌ తాళాలు పగులగొట్టా రు.  టికెట్‌ లేకుండా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. ముగ్గురిలో ఒకరు ప్యాంట్‌ ధరించడంతో ఆలయ సిబ్బంది  టిక్కెట్లను చూపించాలని అడిగారు. తమ వద్ద ఎలాంటి టిక్కెట్లూ లేవని  చెప్పారు.  ఇద్దరిని మహాద్వారం వద్ద,  మరొకరిని వెండి వాకిలి వద్ద పట్టుకొని టీటీడీ విజిలెన్స్‌ అధికారులకు అప్పగించారు. విజిలెన్స్‌ అధికారులు విచారించగా పుణే నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చామని, గేట్‌ తాళాలు పగులగొట్టి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించామని తెలిపారు. విజిలెన్స్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

నివ్వెరపాటు..
ముగ్గురు మాత్రమే ప్రవేశించేందుకు ప్రయత్నిం చారా లేక ఇంకెవరైనా వెళ్లారా, దర్శనం కోసమే ఆలయంలోకి ప్రవేశించారా లేక ఇతరత్రా కారణాలతో ప్రవేశించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిఘా పర్యవేక్షణలో ఉండే శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో ఇలాంటి ఘటన జరగడంతో అటు టీటీడీతో పాటు ఇటు భద్రతా సిబ్బంది నివ్వెరపోయారు. ప్రత్యేక అధికారి విచారణ జరుపుతున్నారు. భద్రత విషయంలో విజిలెన్స్‌ అధికారులు పూర్తి నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారనే చెప్పుకోవాలి. భద్రతా వలయాలు దాటుకుని ఆలయంలోకి ప్రవేశించిన వాళ్లు సామాన్య భక్తులు కావడంతో ఎలాంటి సమస్యా ఎదురవలేదు. ఇదే మెతక వైఖరిని కొనసాగిస్తే అసాంఘిక శక్తులు భక్తుల మాటున చొరబడే ప్రమాదముంది.

విధ్వంసకర పరిస్థితులను సృష్టించే అవకాశముంది. నిత్యం సామాన్య భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు క్యూ కడుతుంటారు. తిరుమల ఇదివరకు భద్రతకు పెట్టింది పేరుగా ఉండేది.  ఇప్పుడు భద్రత కరువైనట్లు కనిపిస్తోంది. తరచూ దొంగతనాలు, చిన్నారుల అపహరణ, చైన్‌స్నాచింగ్‌లకు పాల్ప డే ముఠాలు కూడా కొండపైన కన్నేశాయి. వీఐపీల భద్రత కూడా సవాల్‌గా మారుతోంది. 230కు పైగా సీసీటీవీ కెమెరాలు మాడ వీధుల్లో ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సరైన రీతిలో పర్యవేక్షించకపోవడంతోనే భక్తులు గేట్‌ తాళాలు పగులగొట్టి ఆలయంలోకి చొరబడ్డారు. ఎలా వచ్చారనే సీసీటీవీ ఫుటేజ్‌లు దొరకకపోవడం.. ఆలయానికి మార్గంగా ఉన్న గట్ల వద్ద సరైన రీతిలో కెమెరాలను అమర్చకపోవడంతో ఇలాంటి  ఘటనలు జరుగుతున్నాయి. భక్తులను ఒకటికి రెండుమార్లు తనిఖీ నిర్వహించాల్సిన బాధ్యత కూడా టీటీడీ విజిలెన్స్‌పైనే ఉంది. టిక్కెట్లు లేకుండా రావడం, పైగా ప్యాంట్‌ ధరించి ఉండడంతో టీటీడీ ఆలయ సిబ్బంది గుర్తించారు. విజిలెన్స్‌ సిబ్బంది మాత్రం వారిని గుర్తించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top