అమ్మో...హోటల్‌ ఫుడ్డా...!

Vigilance Attacks On Vizianagaram Hotels - Sakshi

అమ్మకానికి బూజు పట్టినవే..

ముందురోజు ఉడకబెట్టి మరుసటి రోజుకు ఆర్డర్‌ సప్లయి

విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపడిన అసలు రంగు  

విజయనగరం టౌన్‌: ఆకలేస్తుందనుకుని  ఆదరాబాదారాగా హోటల్స్‌కి వెళ్లి, నచ్చినది ఆర్డర్‌ ఇచ్చి తినేద్దామనుకుంటున్నారా!  అసలు విషయం తెలిస్తే  అటువైపు అడుగు కూడా వేయరేమో..  బూజుపట్టిన ఆహార పదార్ధాలను అమ్మకానికి ఉంచడం, ముందు రోజు ఉడకబెట్టి ఫ్రై చేసిన చికెన్, మటన్, రొయ్యలు వంటి మాంస పదార్ధాలను  మరుసటి రోజుకు ఉంచి వాటినే వేడి చేసి ఆర్డర్‌ ఇచ్చిన వారికి ఆహారాన్ని అందించేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి ఆహారాన్ని అందించాల్సిన పలు హోటల్స్‌ యజమానులు హాటల్స్‌కి వచ్చి ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించి, తమకు ఇష్టమైన ఆహారాన్ని తినాలనుకునే భోజనప్రియులకు  రోగాలబారిన పడే ఆహారాన్ని అందిస్తున్నారనేది మింగుడుపడని విషయం. విజిలెన్స్‌ తనిఖీల్లో  దారుణమైన అంశాలు వెలుగులోకి వచ్చాయంటే అతిశయోక్తి కాదు.

శ్రీకాకుళం రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి టి.హరికృష్ణ పర్యవేక్షణలో  పట్టణంలో గల పలు రెస్టారెంట్‌లపై తూనికలు, కొలతలు, ఫుడ్‌ సేఫ్టీ అ«ధికారులతో కలిసి పలు రెస్టారెంట్లపై మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న హ్యాపీ రెస్టారెంట్, ఎస్‌వీఎన్‌ లేక్‌ ప్యాలెస్‌ ఎదురుగా ఉన్న హేలాపురి రెస్టారెంట్,  దాసన్నపేట వద్ద ఉన్న రాజా, మహారాజా తదితర  పలు రెస్టారెంట్‌లపై దాడులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నిర్వహకులు  నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలను వాడేస్తున్నారన్నారు.  బూజుపట్టిన పదార్ధాలను అమ్మకాలు చేపడుతున్నారని, ఒక హోటల్‌లో నిల్వ ఉంచిన మాంసం ఫ్రైడ్‌ చికెన్‌ మీద ఫంగస్‌ను కూడా గుర్తించామన్నారు.   ఈ మేరకు పుడ్‌ సేప్టీ అధికారులు నమూనాలు సేకరించారని, వాటిని నాచారంలోని ఫుడ్‌ సేఫ్టీ లేబోరేటరీకి విశ్లేషణకు పంపిస్తున్నామన్నారు. 

మున్సిపల్‌ అధికారుల నుంచి తీసుకోవాల్సిన  డీ అండ్‌ ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ లేవని, పరిసరాలు అనారోగ్యకరంగా, అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. రెండు హోటల్స్‌ వ్యాపారులపై లీగల్‌ మెటలర్టీ అధికారులు సెక్షన్‌ 8/25 లీగల్‌ మెటలర్జి యాక్ట్‌  2009 ప్రకారం, ప్రతీ ఏడాది ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషీన్‌లను రెన్యువల్‌ చేసి సర్టిఫికెట్‌ పొందనందుకు కేసులు పెట్టామన్నారు.  దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.  తనిఖీల్లో శ్రీకాకుళం రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి భార్గవరావునాయుడు,  డీఎస్పీ వెంకటరత్నం, ఫుడ్‌ సేఫ్టీ అధికారి వరప్రసాద్, లీగల్‌ మెటలర్జీ అధికారి సూర్యత్రినాధరావు,  డీసీటీవో తారకరామారావు, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top