అమ్మ కొట్టడంతో..

Two Hyderabad Missing Muslim Girls Found In Mumbai - Sakshi

ముంబైకి పారిపోయిన బాలికల ఆచూకీ లభ్యం

సాక్షి, బంజారాహిల్స్‌: ఇంటి పనులు చేయడం లేదని తల్లి మందలించడంతో అలిగి ఇంట్లో నుంచి ముంబైకి పారిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని బంజారాహిల్స్‌ పోలీసులు కనుగొన్నారు. వారిద్దరినీ ముంబైలోని పునరావాస కేంద్రం నుంచి శనివారం నగరానికి తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. వివరాలు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఫస్ట్‌ లాన్సర్‌లో నివసిస్తున్న సీమా ఖురేషికి కూతురు ఇష్రత్‌బీ(14) ఉంది. ఆమె సోదరి కూతురు సమీనా బేగం(14) కూడా ఇక్కడే ఉంటోంది.

గత నెల 29న పని చేయడం లేదని ఇష్రత్‌బీని సీమా కొట్టింది. తర్వాత ఆమె సమీపంలో ఫంక్షన్‌కు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఇష్రత్‌బీ, సమీనాబేగం అదృశ్యమయ్యారు. దీంతో 30న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా, ఇద్దరు బాలికలు బ్యాగులు వేసుకొని వెళ్తున్నట్టు గుర్తించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో గుల్బర్గా రైలెక్కిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కానిస్టేబుల్‌ జుబేర్‌ను అక్కడికి పంపించారు.

ఓవైపు పోలీసులు గాలిస్తుండగానే, వారు ఈ నెల 1న ముంబై రైల్వే స్టేషన్‌లో దిగడం, అక్కడ చైల్డ్‌లైన్‌ సిబ్బంది చేతికి చిక్కడం జరిగింది. వారిద్దరినీ పునరావాస కేంద్రానికి తరలించారు. అప్పటికే బంజారాహిల్స్‌ పోలీసులు వారి ఫొటోలతో లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఆ ఫొటోలు చూసిన చైల్డ్‌లైన్‌ సిబ్బంది ఇక్కడికి ఫోన్‌ చేశారు. అయితే వారు పేర్లు తప్పు చెప్పడంతో ఒక రోజంతా టెన్షన్‌ నెలకొంది. మార్గమధ్యంలో ఉన్న కానిస్టేబుల్‌ జుబేర్‌ 3న ముంబైకి చేరుకొని శనివారం నగరానికి తీసుకొచ్చాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top