జల సమాధి

Two Children's Died In Well - Sakshi

దాహం తీర్చుకునేందుకు వెళ్లి దిగుడుబావిలోకి జారిపడ్డ చిన్నారులు 

ఊపిరాడక ఇద్దరు మృత్యువాత 

పైపు సాయంతో బయటపడి ప్రాణాలు దక్కించుకున్న మరొక చిన్నారి  

దప్పిక తీర్చుకునేందుకు దిగుడుబావి వద్దకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీళ్లలోకి జారిపడ్డారు. ఈత రాకపోవడంతో ఇద్దరు మృతి చెందారు. మరో చిన్నారి పైపు సాయంతో బయటకు వచ్చి ప్రాణాపాయం     నుంచి తప్పించుకుంది.

ముదిగుబ్బ : నాగలగుబ్బల గ్రామానికి చెందిన క్రిష్టప్ప కుమార్తె ఉషారాణి (8) మూడో తరగతి, శ్రీనివాసులు కుమారుడు హేమేష్‌బాబు (10) నాలుగో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఎనిమిదో తరగతి విద్యార్థిని ప్రజ్వలితతో కలిసి బుధవారం గ్రామ సమీపంలోని ఈత తోపు వద్దకు వెళ్లారు. ఈతకాయలు ఏరుకొని అనంతరం ఇళ్లకు బయల్దేరారు. వెళ్లే సమయంలో దాహం వేయడంతో అక్కడే ఉన్న దిగుడుబావి వద్దకు వెళ్లారు. మెట్ల ద్వారా బావిలోకి దిగి నీళ్లు తాగుతుండగా హేమేష్‌బాబు జారిపడ్డాడు. అతడి చేయిని పట్టుకుని బయటకు లాగే క్రమంలో ఉషారాణి నీళ్లలోకి పడింది. వీరిద్దరినీ కాపాడాలనే తాపత్రయంతో ప్రజ్వలిత కూడా నీళ్లలోకి జారింది. ముగ్గురికీ ఈత రాకపోవడంతో కాసేపు గిలగిలాకొట్టుకున్నారు.

ప్రజ్వలితకు పైపు ఆసరాగా దొరకడంతో అతికష్టం మీద బయటకు వచ్చి అటుగా వెళుతున్న వారికి జరిగిన విషయం చెప్పినా తమకెందుకులే అన్నట్టు వెళ్లిపోయారు. చివరకు ఒక వ్యక్తి ఆ అమ్మాయిని బైకుపై ఎక్కించుకొని ఊరిలోకి వెళ్లి తెలపడంతో గ్రామస్తులు పరుగుపరుగున వచ్చి దిగుడుబావిలో మునిగిపోయిన ఉషారాణి, హేమేష్‌బాబులను బయటకు తీశారు. అయితే అప్పటికే పిల్లలిద్దరూ చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు రోదించారు. సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌లు వెళ్లి పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేశారు.  
వైఎస్సార్‌సీపీ నాయకుల పరామర్శ 
వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఇందుకూరి నారాయణరెడ్డి నాగలగుబ్బల గ్రామానికి వెళ్లి మృతుల తల్లిదండ్రులను పరామర్శించి దైర్యం చెప్పారు. ఆయన వెంట లీవేష్‌బాబు, శ్రావణ్‌కుమార్, శ్రీనివాసులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top