సమరభేరి సభలో ఆర్టీసీ డ్రైవర్‌ హఠాన్మరణం

TSRTC Strike RTC Driver Died Due To Heart Attack - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సకలజనుల సమరభేరి సభకు బుధవారం హైదరాబాద్‌కు తరలివెళ్లిన డ్రైవర్‌ నంగునూరి బాబు గుండె ఆగింది. కరీంనగర్‌–2 డిపోకు చెందిన ఆయన హఠాన్మరణం కరీంనగర్‌ రూరల్‌ మండలం ఆరెపల్లి గ్రామంలో విషాదం మిగిల్చింది. బాబు మృతి విషయం తెలియడంతో ఆయన కుటుంబం గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. బెజ్జంకి మండలం గాగిళ్లపూర్‌ గ్రామానికి చెందిన బాబు ఉద్యోగరీత్యా ఆరెపల్లిలో నివాసం ఉంటున్నాడు. కరీంనగర్‌–2 డిపోలో 25 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపులో భాగంగా గత 26రోజులుగా ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిన సభలో పాల్గొనేందుకు తోటి కార్మికులతో కలిసి వెళ్లాడు. సభాప్రాంగణంలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. జేఏసీ నాయకులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాబుకు భార్య జయ, కుమారుడు సాయికుమార్, ఇద్దరు కూతుళ్లు దివ్య, సంధ్య ఉన్నారు. కూతురు దివ్యకు వివాహం కాగా.. కుమారుడు బీటెక్‌ చదువుతున్నాడు.

నేడు ఉమ్మడి కరీంనగర్‌ బంద్‌ : ఆర్టీసీ జేఏసీ 
ఆర్టీసీ డ్రైవర్‌ బాబు హఠాన్మరణం చెందడంపై గురువారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో 16 మంది కార్మికులు అమరులయ్యారని ఆర్టీసీ జేఏసీ జిల్లా నాయకులు ఎంపీ రెడ్డి, జక్కుల మల్లేశం, మనోహర్, ఎస్‌కె రాజు, తదితరులు విమర్శించారు. బాబు మరణం బాధాకరమని, ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. బంద్‌లో వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనాలని, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, కుల సంఘాలు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.  

బంద్‌కు పలు పార్టీల మద్దతు.
బంద్‌కు సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ, న్యూడెమోక్రసీ పార్టీలు వేర్వేరు ప్రకటనల్లో మద్దతు ప్రకటించాయి. గురువారం జరిగే బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  

పలువురి సంతాపం.. 
ఆర్టీసీ డ్రైవర్‌ బాబు మృతికి సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు శేఖర్, ఎడ్ల రమేష్, జాక్టో నేతలు, ప్రజా సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
(చదవండి: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top