టీచర్‌ను తాళ్లతో కట్టి.. రోడ్డుపై ఈడ్చి..

రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదని తృణమూల్ నేతల దుశ్చర్య
బలుర్ఘాట్: రోడ్డు వేసేందుకు స్థలం ఇవ్వడం లేదన్న కారణంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని కాళ్లు, చేతులు కట్టేసి, రోడ్డుపై ఈడ్చిన దారుణ దుర్ఘటన పశ్చిమబెంగాల్‌లోని దీనజ్‌పూర్‌లో జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టడంతో రాజకీయ సెగ అలుముకుంది. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాంపూర్ బ్లాక్‌కు చెందిన ప్రభుత్వ టీచర్, బీజేపీ మద్దతుదారు స్మృతికానా దాస్ స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టేలా పంచాయతీ నిర్ణయం తీసుకుంది.
అయితే దీనికి ఆమె అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఉప ప్రధాన్ (డిప్యూటీ చీఫ్) అమల్ సర్కార్.. స్మృతికానా దాస్ కుటుంబాన్ని హింసించారు. టీచర్ కాళ్లను, చేతులను కట్టేయడంతో ఆమె కిందపడిపోవడం, ఆమెను కొందరు దుండగులు దాదాపు 30 అడుగులు ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకెళ్లి బంధించడం వీడియోలో రికార్డయ్యింది. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో గూండాయిజం సాగుతున్నదనడానికి ఇది ఉదాహరణ అంటూ విమర్శించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి