
థానే: సొంత సోదరిని అతికిరాతకంగా హత్య చేసిన ముగ్గురు సోదరులను పట్టుకున్నామని మహారాష్ట్రలోని థానే పోలీసులు బుధవారం తెలిపారు. మొత్తం నలుగురు సోదరులు కలిసి తమ సోదరి ప్రతిభ మాత్రే(29)ని హత్యచేయగా తాజాగా నథా అశోక్ పాటిల్(31), భగవాన్ అశోక్ పాటిల్(24), బాలాజీ అశోక్ పాటిల్(20) అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పాండురంగ్ అశోక్ పాటిల్ కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానే జిల్లాలోని దాయ్‌గఢ్ గ్రామానికి చెందిన ప్రతిభ మాత్రే భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుని పుట్టింట్లో ఉంటుంది. తల్లిదండ్రులు లేకపోవడంతో సోదరులతో కలిసి ఉంటూ ఓ బార్ షాప్‌లో పనిచేస్తోంది. అయితే, సోదరి ప్రవర్తన నచ్చని సోదరులు ఆమెను వేరుగా ఉండాలంటూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలోనే గత మే1న రాత్రి నలుగురు సోదరులు కలిసి ఆమె గొంతు నులుమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలోపెట్టి పొలంలో కిరోసిన్ పోసి తగులబెట్టారు. ఈ హత్య గురించి గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం చేరడంతో నిందితులు పారిపోయారు. అప్పటి నుంచి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం రాత్రి ముగ్గురిని పట్టుకున్నారు.