దూసుకొచ్చిన మృత్యువు | Ten Years Girl Died in Car Accident | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Dec 24 2018 12:33 PM | Updated on Dec 24 2018 12:33 PM

Ten Years Girl Died in Car Accident - Sakshi

మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు బంగ్లా బస్టాండ్‌ వద్ద కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీ కొనడంతో పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామానికి చెందిన కురువ మాదమ్మ, బాలకృష్ణ దంపతుల కూమార్తె నాగేంద్రమ్మను పదకొండేళ్ల క్రితం జూపాడుబంగ్లా మండలం, తంగెడంచ గ్రామానికి చెందిన బాలమద్దిలేటికిచ్చి వివాహం చేశారు. వీరికి మధురాణి(10), మైథిలీ అను ఇద్దరు కుమార్తెలు. కాగా బాలమద్దిలేటి అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం మృతిచెందడంతో భార్య నాగేంద్రమ్మ ఆరేళ్ల క్రితం పుట్టిళ్లయిన నన్నూరుకు వచ్చి తల్లితండ్రుల వద్దనే స్థానిక బైరెడ్డి కాలనీలో నివాసముంటోంది. కూలీ పనులకు వెళ్తూ పిల్లలద్దరిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. మధురాణి 5వ తరగతి, మైథిలీ 2వ తరగతి చదువుతున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో జాతీయ రహదారి పక్కనున్న హైస్కూల్‌ వద్ద మిరప దిగుబడిని ఆరబెట్టుకున్న అవ్వ దగ్గరకు వెళ్లేందుకు చిన్నారులిద్దరూ తల్లి నాగేంద్రమ్మతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి నంద్యాల వైపునకు వెళ్తున్న కారు మధురాణిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కారును అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కళ్లెదుటే  కూతురు కారు ప్రమాదంలో మృతి చెందడంతో నాగేంద్రమ్మ రోధిస్తున్న తీరు పలువురిని కలచివేసింది.

హైవేపై స్థానికులు ఆందోళన..
చిన్నారి మృతితో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని హైవే అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా జాతీయ రహదారిని దిగ్భందించారు. దీంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎస్‌ఐ మధుసూదన్‌రావు, ట్రైనీ ఎస్‌ఐ ఆశాలత, ఏస్‌ వెంకటరామిరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నన్నూరు బస్టాండ్‌ వద్ద అండర్‌ బ్రిడ్జిని నిర్మించాలని పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు చేపట్టినా పట్టించుకోలేదని, సమస్య పరిష్కరించాలని మూడు నెలల క్రితం ఎమ్మెల్యే గౌరు చరిత, సీపీఎం నాయకులు రామకృష్ణ ఆధ్వర్యంలో టోల్‌ గేట్‌ వద్ద ధర్నా చేసిన సమయంలో 20 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన హైవే అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పోలీసులతో వాదనకు దిగారు. సమస్యను పరిష్కరించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక మృతికి హైవే అధికారులను బాధ్యులను చేసి కేసు నమోదు చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకున్నారు. ఎస్‌ఐ హైవే అధికారులను మరోసారి ఉన్నతాధికారల వద్దకు పిలిపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   

ఎమ్మెల్యే నివాళి..
ప్రమాద విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, పార్టీ జిల్లా నాయకులు విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు రామకృష్ణ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చిన్నారి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రత్యేక వెంతెన నిర్మించేందుకు కృషిచేస్తామన్నారు. హైవే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరోసారి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనంతరం చిన్నారి అంత్యక్రియలకు గౌరు దంపతులు రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. వైఎస్సార్‌సీపీ మండల నాయకులు గౌండ రాముడు, షంషుద్దీన్, షరీఫ్‌మియా, ఉశేన్‌సర్కార్‌ ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement