తాగొచ్చిసతాయిస్తున్నాడు.. అందుకే చనిపోతున్నా!

Teacher Suicide Video Viral In Social Media Kurnool - Sakshi

వైరల్‌గా మారిన టీచర్‌ సూసైడ్‌ సెల్ఫీ వీడియో

కర్నూలు, వెల్దుర్తి:  ‘నా భర్త వై.సుధాకర్‌ చిన్న మల్కాపురంలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ తాగొచ్చి నన్ను, పిల్లల్ని సతాయిస్తున్నాడు. అందువల్లే నేను సూసైడ్‌ చేసుకుంటున్నా. దయచేసి.. నా ముగ్గురు ఆడపిల్లల్ని వాడి చేతికి అప్పజెప్పొద్దు’ అంటూ టీచర్‌ పి.నాగమల్లీశ్వరీబాయి(40) సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ప్యాపిలి మండలం నేరేడుచెర్లకు చెందిన నాగమల్లీశ్వరీ బాయి, కల్లూరు మండలం బొల్లవరానికి చెందిన ఎరుకలి సుధాకర్‌ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సుధాకర్‌కు ఇది రెండో వివాహం. వృత్తిరీత్యా ఇద్దరూ ఉపాధ్యాయులే. సుధాకర్‌ డోన్‌ మండలం చిన్న మల్కాపురంలో ఎస్‌జీటీగా, ఆమె వెల్దుర్తి మండలం బోయనపల్లెలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు.

విషాదంలో మల్లీశ్వరీబాయి కుమార్తెలు
వీరికి 4వ తరగతి చదువుతున్న జ్యోత్స్న, యూకేజీ, ఎల్‌కేజీ చదువుతున్న జీవన సుధ, చైత అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెళ్లి చేసుకున్న నాటి నుంచే తన భర్త తాగొచ్చి వేధింపులకు గురిచేసేవారని నాగమల్లీశ్వరి పలుమార్లు పోలీసులను ఆశ్రయించారు. అలాగే పెద్దల పంచాయితీలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ నెల 19న శుక్రవారం  బోయనపల్లెలోని నివాస గృహంలో సెల్ఫీ వీడియో తీసుకుని కేశాలంకరణకు ఉపయోగించే సూపర్‌ వాస్మోల్‌ ద్రావకాన్ని తాగారు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. కోలుకోలేక ఈ నెల 21న ఆమె చనిపోయారు. అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామం నేరేడుచెర్లలో ముగిశాయి.  మల్లీశ్వరీ బాయి తమ్ముడు రమేశ్‌ ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు  సుధాకర్‌పై కేసు నమోదు చేశారు. అలాగే అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుసమాచారం.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top