బడా బిజినెస్‌మెన్‌ అంటూ వలేస్తాడు

Tamil Nadu Man Arrest in Facebook Fraud Case Hyderabad - Sakshi

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లతో యువతులకు గాలం

స్నేహంగా ఉంటూ ఫొటోలు, వీడియోల సేకరణ

అత్యవసరం పేరుతో రూ.లక్షల్లో వసూళ్లు

డబ్బు పంపకపోతే బెదిరింపులు

నగర మహిళ నుంచి రూ.13 లక్షలు వసూలు  

చెన్నైవాసి సల్మాన్‌ అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో:  బడా బిజినెస్‌మెన్‌ అంటూ ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి పరిచయం పెంచుకొని అందినకాడికి దండుకుంటున్న సైబర్‌ నేరగాడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సైబర్‌ క్రైమ్‌ సీఐ గంగాధర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహ్మద్‌ సల్మాన్‌ నవాజ్‌ సర్కార్‌ పేరుతో బాధితురాలి ఫేస్‌బుక్‌ ఖాతాకు 2018 జనవరిలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రావడంతో యాక్సెప్ట్‌ చేసింది. ముంబైలో తానో బడా పారిశ్రామికవేత్తనని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నానని పరిచయం చేసుకున్నాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు ఫేస్‌బుక్‌ మేసేంజర్, వాట్సాప్‌ ద్వారా చాట్‌ చేయడంతో మొదలెట్టింది. ఈ సందర్భంగా అతను పలు స్టార్‌ హోటళ్లలో ప్రైవేట్‌ బాడీ గార్డ్‌లతో తీసుకున్న ఫొటోలను కూడా పంపాడు. ఈ క్రమంలో వారిమధ్య సన్నిహిత్యం పెరగడంతో ప్రైవేట్‌గా వీడియోకాల్‌ మాట్లాడుకునేవారు.

ఆ తర్వాత కొద్ది రోజులకు తనకు రావాల్సిన డబ్బులు కొందరి వద్ద ఆగిపోయాయని, తన వ్యాపార విస్తరణతో పాటు వైద్య చికిత్స కోసం డబ్బులు అవసరమున్నట్లు చెప్పడంతో బాధితురాలు నమ్మింది. ఇలా సల్మాన్‌ స్నేహితుల బ్యాంక్‌ ఖాతాల్లో పలు దఫాలుగా రూ.12,96,000 డిపాజిట్‌ చేసింది. ఆ తర్వాత అనుమానం వచ్చిన బాధితురాలు ఇంకా డబ్బులు డిపాజిట్‌ చేయలేనని చెప్పడంతో నీ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. వేధింపులు తీవ్రం కావడంతో బాధితురాలు ఈ నెల 11న సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సల్మాన్‌ది చెన్నై అని, ముంబైలో ఉంటున్నట్లు గుర్తించి టెక్నికల్‌ ఆధారాలతో అతడిని పట్టుకున్నారు. ముంబై నుంచి సల్మాన్‌ను ట్రాన్సిట్‌ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఫేస్‌బుక్‌లో  అందంగా కనబడే యువతులను లక్ష్యంగా చేసుకొని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపి బడా బిజినెస్‌మెన్‌ అంటూ పరిచయం పెంచుకునేవాడినని, వారితో చాట్‌ చేసిన వ్యక్తిగత సమాచారం, వారి పంపిన ఫొటోలు, వీడియోలు అడ్డుపెట్టుకొని బెదిరిస్తూ డబ్బు వసూలుచేసేవాడి’నని సల్మాన్‌ సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట అంగీకరించాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top