పోకిరీలకు చెక్‌

Taking Actions Against Eve Teasers By She Teams - Sakshi

 జల్లెడ పడుతున్న మహిళా రక్షక్‌ బృందాలు

 ఈవ్‌టీజర్ల భరతం పడుతున్న వైనం

 తల్లిదండ్రుల సమక్షంలో  145 మందికి కౌన్సెలింగ్‌

 మళ్లీ దొరికితే కటకటాలే  

కళాశాలలు.. విద్యాసంస్థలు.. బస్‌స్టాపులు.. రైల్వేస్టేషన్లు.. వాణిజ్య సముదాయాలు.. సినిమా థియేటర్ల వద్ద యువతులు, మహిళలను వేధిస్తున్న పోకిరీలకు మహిళా రక్షక్‌ బృందాలు బుద్ధి చెబుతున్నాయి. బృంద సభ్యులు మఫ్టీలో తిరుగుతూ ఈవ్‌టీజర్ల భరతం పడుతున్నారు.   

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): మహిళలు సమాజంలో ధైర్యంగా తిరిగే భరోసా ఇవ్వాలి. ఆకతాయిల ఆటలు ఇక సాగవనే నమ్మకం కలిగించాలి. తమ కోసం ఓ నిఘా వ్యవస్థ అండగా ఉందనే అవగాహన తేవాలి. అప్పుడు చక్కటి సమాజం ఆవిష్కృతమవుతుందనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రంలో తొలిసారిగా 10 మహిళా రక్షక్‌ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి సత్ఫలితాలిస్తున్నాయి. నగరంలో ఇప్పటి వరకు 145 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారి పూర్తి వివరాలను సేకరించి రికార్డుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. పోకిరీల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి వారి సమక్షంలో పోలీసు సిబ్బంది కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. అనంతరం తల్లిదండ్రుల పూచీకత్తుపై వారిని బయటకు విడిచి పెడుతున్నారు. 
తొలిసారి కౌన్సెలింగ్‌తో సరి.
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన ఆకతాయిలకు తొలిసారిగా పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. అతని గత చరిత్రను పరిశీలించి నేరచరిత్ర లేకపోతే తల్లిదండ్రుల పూచీకత్తుపై విడిచి పెడుతున్నారు. మరోసారి చిక్కితే కటకటాల  లెక్కించాల్సిందేనని వారిని హెచ్చరిస్తున్నారు. పోలీసులు కౌన్సెలింగ్‌ చేసిన వారిలో అధిక శాతం మంది 20 నుంచి 30 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు.
సత్ఫలితాలు ..
మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన రక్షక్‌ బృందాలు సత్ఫలితాలిస్తున్నాయి. వేదాయపాళెం, హరనాథపురం తదితర ప్రాంతాల్లో పలువురు ఈవ్‌టీజర్లపై డయల్‌ 100కు ఫిర్యాదులు వెళ్లాయి. తక్షణమే స్పందించిన బృందాలు హుటాహుటిన  ఘటనా స్థలానికి చేరుకుని ఈవ్‌టీజర్ల భరతం పట్టాయి. దీంతో ఆయా ప్రాంత వాసులు బృందాల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 
త్వరలో అవగాహన సదస్సులు 
పోకిరీల ఆటలు కట్టిస్తున్న మహిళా రక్షక్‌ బృందాలు త్వరలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు, విద్యాసంస్థలకు వెళ్లనున్నాయి. ఈవ్‌టీజింగ్‌కు వ్యతిరేకంగా విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు పక్కాప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విద్యార్థినుల మనోగతం, వేధించిన వారిపై చట్టపరంగా పోలీసులు చేపట్టే చర్యలను వివరించనున్నారు.   

షీ బృందం ఏం చేస్తుందంటే.. 
కళాళాలలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ ఈవ్‌టీజర్లను గుర్తించి వారిని అరెస్ట్‌ చేస్తారు. ఒక్కో బృందంలో నలుగురు ఉంటారు. వీరు మఫ్టీలో తిరుగుతూ ఈవ్‌టీజర్ల భరతం పడుతారు. ఎలాంటి నేర ప్రవృత్తి లేకుండా తొలిసారిగా ఈవ్‌టీజింగ్‌ చేసిన వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేసి గట్టిగా మందలిస్తారు. కరుడుగట్టిన వారైతే కేసులు నమోదు చేస్తారు. ఎవరైనా మహిళలు తామెదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేస్తే వారి పేరు బయటకు రానివ్వకుండా విచారిస్తారు.   

విద్యార్థినులు, మహిళలు ఏం చేయాలంటే..   
మగవాళ్లు మాటలతో కానీ, చేష్టలతో కాని, అనుచిత రీతిలో తాకటం, అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయడం వంటి చర్యలతో ఇబ్బంది పెడుతుంటే డయల్‌ 100కు కాల్‌ చేసి తామున్న ప్రదేశాన్ని తెలియజేయాలి. లేదా పబ్లిక్‌ ఐవాట్సప్‌ నంబర్‌ 9390777727కు సమాచారం (టైప్‌చేసి గానీ, ఫొటోల రూపంలో గాని) పంపితే వెంటనే మహిళా రక్షక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఈవ్‌టీజర్ల భరతం పడుతాయి. ఈవ్‌టీజర్లే కాదు ఇంకా ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా పై నంబర్లకు ఫోను చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుదారుల వివరాలను బృందాలు గోప్యంగా ఉంచుతాయి.   

నిర్భయంగా ఫిర్యాదు చేయండి
మహిళల రక్షణే ధ్యేయంగా మహిళా రక్షక్‌ టీంలను ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రవేశ పెట్టారు. నగరంలోని ఆరు పోలీసుస్టేషన్లలో ఆరు బృందాలు, మహిళా పోలీసుస్టేషన్‌ పరిధిలో నాలుగు బృందాలు పని చేస్తున్నాయి. మఫ్టీలో తిరుగుతూ ఆకతాయిల భరతం పడుతున్నాం. మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. మహిళలు, విద్యార్థులు తామెదుర్కొంటున్న సమస్యలపై డయల్‌ 100, 9390777727, 94904 39561లకు ఫిర్యాదు చేయాలి. తగిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు సైతం సమాచారం అందించవచ్చు. 

– పి. శ్రీధర్, మహిళా రక్షక్‌టీమ్స్‌ నోడల్‌ అధికారి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top