‘చూచిరాత స్కామ్‌’లో మరో అరెస్టు

SV Degree College Correspondent Arrested In Mass Coping Scam - Sakshi

కటకటాల్లోకి ఎస్వీ డిగ్రీ కాలేజ్‌ కరస్పాండెంట్‌

సాక్షి, సిటీబ్యూరో : ఉస్మానియా యూనివర్శిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో జరిగిన మాస్‌ కాపీయింగ్‌ కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు మరో నిందితుడిని కటకటాల్లోకి పంపారు. ఈ స్కామ్‌లో పాత్రధారిగా ఉన్న రామాంతపూర్‌లోని ఎస్వీ డిగ్రీ కాలేజ్‌ కరస్పాండెంట్‌ రాధాకృష్ణరెడ్డిని అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి బుధవారం తెలిపారు. ఈ కేసులో సీసీఎస్‌ పోలీసులు ఇప్పటికే ఆర్కే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసిన విషయం విదితమే. ఉస్మానియా యూనివర్శిటీకి (ఓయూ) సంబంధించిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు గత ఏడాది అక్టోబర్‌లో జరిగాయి. దీని కోసం కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో ముషీరాబాద్‌లోని ఆర్కే డిగ్రీ కాలేజీ ఒకటి. సాధారణంగా పరీక్ష కేంద్రానికి యూనివర్శిటీ ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల సెట్లను అందిస్తుంది.

అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ సెంటర్‌లో పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య కంటే కొన్ని ఎక్కువగానే జవాబు పత్రాల సెట్‌లు ఇస్తుంది. దీన్నే ఆర్కే డిగ్రీ కాలేజ్‌ తమకు అనుకూలంగా మార్చుకుంది. సప్లమెంటరీ పరీక్ష రాసే 104 మంది విద్యార్థులతో కుమ్మక్కై వేరే కేంద్రానికి సంబంధించి హాల్‌టిక్కెట్‌ జారీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తమ కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది. వీరికోసం యూనివర్శిటీ నుంచి అదనంగా వచ్చే జవాబు పత్రాల సెట్‌లను వాడుకుంది. ఇందుకుగాను ఒక్కో సబ్జెక్ట్‌కు దాదాపు రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇలా మాస్‌ కాపీయింగ్‌ ద్వారా పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరి పేర్లతో రెండేసి ఆన్సర్‌ షీట్లు సిద్ధమయ్యాయి. గతేడాది అక్టోబర్‌ 21న ఆర్కే డిగ్రీ కళాశాల కేంద్రంలో జరిగిన కంప్యూటర్‌ సైన్స్‌–3 పరీక్ష పేపర్లు దిద్దుతున్న యూనివర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఈ మాల్‌ ప్రాక్టీస్‌ స్కామ్‌ను పసిగట్టారు.

ఆర్‌.హరికృష్ణ అనే విద్యార్థి పేరుతో రెండు ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ వర్శిటీకి వచ్చాయి. ఇతడికి పరీక్ష కేంద్రంలో 7257771 నెంబర్‌తో కూడిన బుక్‌లెట్‌ ఇవ్వగా... దీంతో పాటు 7257384 నెంబర్‌తో కూడిన బుక్‌లెట్‌ సైతం అతడి నుంచి కాలేజీ ద్వారా వర్శిటీకి చేరింది. దీంతో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇతడి ఫలితాన్ని ఆపేశారు. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ వర్శిటీ అధికారులను సంప్రదించగా... ఆర్కే కాలేజీ నుంచి అటెండెన్స్‌ షీట్‌ తీసుకురావాల్సిందిగా సూచించారు. హరికృష్ణ తీసుకువెళ్లిన షీట్‌లో ఉన్న వివరాల ప్రకారం 7257771 బుక్‌లెట్‌ అతడికి జారీ అయింది. దీనిపై చీఫ్‌ సూపరింటెండెంట్‌ ముద్ర ఉండగా... 7257384 నెంబర్‌తో కూడిన బుక్‌లెట్‌పై కాలేజీ ప్రిన్సిపాల్‌ ముద్ర ఉంది. దీంతో లోతుగా ఆరా తీసిన అధికారులు మాల్‌ప్రాక్టీస్‌ జరిగినట్లు గుర్తించారు. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన మొత్తం 104 మంది విద్యార్థులు దీనికి పాల్పడినట్లు తేల్చారు. వీరికి వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించినా... పరీక్ష రాసింది మాత్రం ఆర్కే కాలేజీలో అని తేల్చారు.

వర్శిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కాలేజీ యాజమాన్యం, చీఫ్‌ సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, ఇన్విజిలేటర్స్‌ తదితరులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎస్సై బి.జగదీశ్వర్‌రావు మాల్‌ ప్రాక్టీస్‌ జరిగినట్లు గుర్తించిన సమాధాన పత్రాలతో పాటు అనేక ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి కాలేజీ ప్రిన్సిపాల్‌ స్వర్ణలత పాత్ర రూఢీ కావడంతో గతంలో ఆమెను తాజాగా రాధాకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. ఈ 104 మంది విద్యార్థులను కొందరు దళారులు ఆర్కే డిగ్రీ కాలేజీ నిర్వాహకుల వద్దకు తీసుకువచ్చినట్లు పోలీసులు తేల్చారు. నగదు చెల్లించి మాల్‌ ప్రాక్టీస్‌ ద్వారా పరీక్ష రాసిన నేపథ్యంలో వీరినీ నిందితుల జాబితాలో చేర్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top