నా భర్తను హత్యచేశారు

Suspicions on husbend death

రూ.11లక్షలు డబ్బు అడిగినందుకే..

రాజంపేట మార్కెట్‌యార్డ్‌ మాజీ ఛైర్మెన్‌

ఎద్దుల విజయసాగర్‌ హస్తం

మృతుని భార్య, కుమారుల ఆరోపణ

నందలూరు : ఆడపూరు పంచాయతీ పరిధిలోని మర్రిపల్లె దళితవాడ సమీపంలో ఈనెల 18వ తేదీన కుప్పాల వేణుగోపాల్‌ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతుని భార్య వరలక్ష్మి, కుమారులు సాయి, మణిశేఖర్‌లు పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపించారు. బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ వ్యాపారాల నిమిత్తం తన భర్త ఒంటిమిట్టలోని బ్రాంది షాపులో రూ.8లక్షలు, నందలూరు మండలం మర్రిపల్లెలోని పూలతోటపై రూ.3లక్షలు పెట్టుబడి పెట్టాడని తెలిపారు. తన కుమారుడి ఉద్యోగం కోసం డబ్బులు కావాలని, తాను పెట్టుబడిన పెట్టిన డబ్బులు మొత్తం రూ.11 లక్షలు ఇవ్వాలని  పూలతోట యజమానిని అడుగుతూ వచ్చాడన్నారు.  దీంతో తోటయజమాని ప్రసాద్‌ నేడు, రేపు ఇస్తానంటూ తిప్పుకుని చివరకు  హత్యచేశాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

హత్య జరిగే ముందురోజు మధ్యాహ్నం కూడా తన భర్తతో తాను ఫోన్‌లో మాట్లాడానని, ఇంకా భోజనం చేయలేదని, తోట యజమాని ప్రసాద్‌ తనకు భోజనం తీసుకువస్తాడని చెప్పాడన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అని వచ్చిందని తెలిపారు. తన భర్త మరణించిన విషయం తోట పక్కన ఉన్న మరో వ్యక్తి తమకు తెలిపాడన్నారు. మా ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదని ఆయన చేతులు, కాళ్లపై గాయాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ హత్యలో రాజంపేట మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ ఎద్దుల విజయసాగర్, తోట కాపలాదారుడు పెంచలయ్యల హస్తం కూడా ఉందన్నారు. ఈ ముగ్గురిని విచారించి నిజానిజాలు వెలికితీసి తమకు న్యాయం చేయాలని స్థానిక ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డిని కోరారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top