సూరత్‌ అత్యాచార బాధితురాలు తెలుగు బిడ్డే..!

Surat Rape And Murder Victim Found Andhra Pradesh Native - Sakshi

సూరత్‌: గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక ఎవరో తెలిసిపోయింది. గత పన్నెండు రోజులుగా బాలిక తల్లిదండ్రులెవరో గుర్తించేందుకు పోలీసులు చేపట్టిన ‘సోషల్‌ పోస్టర్‌’ ప్రచారం ఫలించింది. సోషల్‌ మీడియాలో మృతురాలి ఫోటో చూసి ఆమె తమ కూతురేనంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం సూరత్‌ పోలీసులను ఆశ్రయించింది. తమ కూతురు గతేడాది అక్టోబర్‌లో అదృశ్యమైందని వారు పేర్కొన్నారు. పోలీసులు వారి వద్ద గల చిన్నారి ఆధార్‌ కార్డుతో మృతదేహాన్ని పోల్చి చూశారు. మృతురాలి తల్లిదండ్రులు వారేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

10 రోజుల జాప్యమెందుకు..?
శరీరంపై 86 గాట్లతో సూరత్‌లోని భేస్తాన్‌ ప్రాంతంలో గల క్రికెట్‌ స్టేడియం వద్ద బాలిక మృతదేహాన్ని ఏప్రిల్‌ 6న పోలీసులు గుర్తించారు. దాదాపు 5 గంటల పోస్టుమార్టం అనంతరం బాలిక దాదాపు 8 రోజలు అత్యాచారానికి, ఆపై హత్యకు గురైందని తేలింది. అయితే ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం బాలిక శరీర నమూనాలను పోలీసులు ఏప్రిల్‌ 6న పంపించాల్సి ఉంది. కానీ 10 రోజుల జాప్యం తర్వాత ఏప్రిల్‌ 16న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఆ నమూనాలు చేరినట్లు తెలుస్తోంది.

దీనిపై పోలీసుల్ని వివరణ కోరగా నమూనాలను ఏప్రిల్‌ 6నే పంపినట్లు చెప్పడం గమనార్హం. ఈ పది రోజుల జాప్యానికి కారణాలేమై ఉంటాయన్నది ఎన్నో పశ్నలను లేవనెత్తుతోంది. బాలిక తల్లిదండ్రులెవరో గుర్తించేందుకు అటు పోలీసులు,వ్యాపారులు స్పందించిన తీరు అమోఘం. సూరత్‌ ప్రాంతంలోని ప్రతి వ్యాపారి తమ వంతుగా ఆమె ఆచూకీని తెలుపుతూ వారివారి దుకాణాల ముందు ఆ చిన్నారి ఫోటోని  ప్రదర్శించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top