కిడ్నాప్‌ చేశారని విద్యార్థి డ్రామా

student drama was  kidnapped - Sakshi

పోలీసులకు తెలిపిన తల్లిదండ్రులు

కట్టుకథ అని తేల్చిన పోలీసులు

నిజామాబాద్‌, గాంధారి(ఎల్లారెడ్డి) : మండల కేంద్రానికి చెందిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి శుక్రవారం ఉదయం తనను ఎవరో కిడ్నాప్‌ చేసి దాడి చేశారని తాను తప్పించుకుని వచ్చానని తల్లిదండ్రులకు తెలిపాడు. ఆందోళన చెందిన విద్యార్థి తల్లిదండ్రులు వెంటనే ఎస్‌ఐ సత్యనారాయణకు దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎస్‌ఐ విద్యార్థితో మాట్లాడారు. పోలీసుల విచారణలో విద్యార్థే కట్టు కథ అల్లాడని తేలింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. సదరు విద్యార్థి మండల కేంద్రంలోని హైస్కూళ్లో చదువుతున్నాడు. ఇటీవలే విద్యార్థి నానమ్మ మృతి చెందింది. దసరా సెలవులతో పాటు నానమ్మ చనిపోయిందనే కారణంతో 15 రోజులుగా పాఠశాలకు వెళ్లలేదు. ఆచారాల మేరకు విద్యార్థి తల్లిదండ్రులు పిల్లలతో పాటు బంధువుల ఇళ్లకు వెళ్లి గురువారం తిరిగి వచ్చారు. శుక్రవారం పాఠశాలకు వెళ్లాలని విద్యార్థికి అతడి తల్లి చెప్పింది.

అయితే ఆ విద్యార్థి మాత్రం పాఠశాలకు వెళ్లక తల్లి బెదిరించింది. దీంతో సదరు విద్యార్థి బయటకు వెళ్లి కిడ్పాప్‌ కథ అల్లుకుని ఇంటికి వచ్చాడు. తనను ఎవరో ముఖాలకు ముసుగులతో వచ్చి ఆటోలో ఎక్కించుకుని లక్ష్మమ్మ గుడి వద్దకు తీసుకెళ్లి దాడి చేసి గాయపర్చారని కడుపుపై గీరిన గాయాలను చూపించాడు. ఆందోళనతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ లక్ష్మమ్మగుడి వద్దకు వెళ్లి పరిశీలించి అనంతరం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను విచారించారు. ఒకటికొకటి పొంతన లేక అనుమానం వచ్చి నిజం చెప్పాలని విద్యార్థిని మళ్లీ విచారించగా తానే గీసుకుకున్నానని తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని తెలిపాడు. పిల్లలను బెదిరించడం, కొట్టవద్దని, గమనిస్తుండాలని ఎస్‌ఐ విద్యార్థి తల్లిదండ్రులకు సూచించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top